ఛత్తీస్‌గఢ్‌లో 11 ఏళ్లుగా కొనసాగిన న్యాయపోరాటానికి ముగింపు లభించింది. రాయ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ 43 మంది సహాయ ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారికి ఉద్యోగ కొనసాగింపు, సీనియారిటీ, ఇతర సేవా ప్రయోజనాలు కల్పిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. 2013లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో ఎంపికైన 43 మంది 2014 అక్టోబర్ 15న విధుల్లో చేరారు. అయితే కేవలం 45 రోజులకే ఎలాంటి సరైన ప్రక్రియ లేకుండా వారి నియామకాలను రద్దు చేశారు. దీంతో బాధిత ఉపాధ్యాయులు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
2019 ఏప్రిల్ 16న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నియామక రద్దు ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా, వివక్షపూరితంగా పేర్కొంటూ కొట్టివేసింది. ఉద్యోగ కొనసాగింపు, సీనియారిటీ, నోషనల్ ప్రయోజనాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే పని చేయని కాలానికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, 2022 మార్చి 2న ఆ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది.
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ దాఖలు చేసింది. 2025 ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో 43 మంది ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చిన తీర్పు తుది నిర్ణయంగా మారింది. అయినప్పటికీ అమలు ఆలస్యం కావడంతో ఉపాధ్యాయులు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టి 2026 ఆగస్టు 4న రాయ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 43 మంది సహాయ ఉపాధ్యాయులకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం సేవా కొనసాగింపు, సీనియారిటీ, నోషనల్ ప్రయోజనాలు, ఇతర అనుబంధ ప్రయోజనాలు అందించనున్నట్లు వెల్లడించింది.
ఈ తీర్పు కేవలం ఉపాధ్యాయుల పునర్నియామకమే కాకుండా రాజ్యాంగ హక్కులు, న్యాయపరమైన ప్రక్రియ ప్రాముఖ్యతను మరోసారి చాటిందని వారి తరఫు న్యాయవాది రూపేష్ సాహు తెలిపారు. ఉద్యోగుల సేవలను సరైన చట్టపరమైన విధానాలు పాటించకుండా రద్దు చేయలేరని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత తమకు న్యాయం దక్కిందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news