తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనుదారుల పెండింగ్ బకాయిల చెల్లింపులో మరో కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మరో రూ.2,000 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 29న తొలి విడతగా రూ.2,000 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, ఈ నెల 29న మరోసారి అదే మొత్తాన్ని కేటాయించడంతో మొత్తం విడుదలైన నిధుల విలువ రూ.4,000 కోట్లకు చేరింది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం జీపీఎఫ్ ఖాతాల్లో ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవని స్పష్టం చేసింది.
అలాగే విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా క్లియర్ చేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. ఉద్యోగులు, పింఛనుదారులు సమర్పించిన రూ.10 వేల లోపు విలువైన దాదాపు ఐదు లక్షల బిల్లులను ప్రత్యేకంగా గుర్తించి వంద శాతం చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపుతున్న సానుకూల దృక్పథం అభినందనీయమని పేర్కొన్నాయి. మిగిలిన బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడించాయి.
రెండు నెలల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు వంద రోజుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించే కార్యాచరణకు ఆమోదం లభించింది. ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా బకాయిల చెల్లింపులు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం అమలు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌కు సంబంధించి కూడా ఆర్థికశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు, పింఛనుదారుల మూల వేతనం లేదా పింఛన్లో 1.5 శాతం మొత్తాన్ని ఈహెచ్ఎస్ నిధికి జమ చేయాలని స్పష్టం చేసింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులుగా ఉన్నా లేదా ఒకరు పింఛనుదారులైనా వారిలో ఒక్కరి వేతనం నుంచే ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది.
ఇదిలా ఉండగా గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల నేపథ్యంలో ప్రతి నెలా సగటున రూ.700 కోట్ల చొప్పున బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించింది. ఇప్పటికే పలు విడతల్లో నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, తాజాగా మరో రూ.2,000 కోట్లు కేటాయించడం ద్వారా ఉద్యోగులు, పింఛనుదారుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తోందనే సంకేతాలు ఇచ్చింది. ఈ చర్యతో వేలాది మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ఊరట లభించనుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news