తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో 'అరుంధతి' ఒకటి. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ అనుష్క శెట్టి కెరీర్‌ను ఒక్కసారిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. జేజమ్మ పాత్రలో అనుష్క నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా మొదట అనుష్క వద్దకు కాకుండా మరో హీరోయిన్ వద్దకు వెళ్లిందన్న విషయం చాలా మందికి తెలియదు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మలయాళ స్టార్ నటి మమతా మోహన్‌దాస్. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, 'అరుంధతి' సినిమాను వదులుకోవడం తన కెరీర్లో తీసుకున్న అతిపెద్ద తప్పుల్లో ఒకటిగా అభివర్ణించారు.
మమతా మోహన్‌దాస్ మాట్లాడుతూ.. 'యమదొంగ' కంటే ముందే తనకు 'అరుంధతి' సినిమా అవకాశం వచ్చిందని తెలిపారు. సినిమా కోసం సైన్ కూడా చేశానని, కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని చెప్పారు. తన మేనేజర్ ఆ సమయంలో ఆ ప్రొడక్షన్ హౌస్ గురించి ప్రతికూలంగా చెప్పడంతో, అతని మాటలను నమ్మి సినిమా నుంచి తప్పుకున్నానని వెల్లడించారు.
ఆ సమయంలో తెలుగు సినీ పరిశ్రమ గురించి తనకు పెద్దగా అవగాహన లేదని మమతా చెప్పారు. తెలుగు భాష కూడా తెలియదని, చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు ఎక్కువగా చూడలేదని పేర్కొన్నారు. అందుకే అనుభవం లేక మేనేజర్ చెప్పిన మాటలనే నమ్మి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
తాను సినిమా నుంచి తప్పుకోవడంతో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా నిరాశ చెందారని మమతా గుర్తు చేసుకున్నారు. అనంతరం అదే పాత్ర కోసం అనుష్క శెట్టిని ఎంపిక చేయగా, ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి చరిత్ర సృష్టించిందన్నారు.
2009లో విడుదలైన 'అరుంధతి' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా జేజమ్మ పాత్రలో అనుష్క నటన, సోనూ సూద్ పోషించిన పశుపతి పాత్ర, కోడి రామకృష్ణ దర్శకత్వం సినిమాను కల్ట్ క్లాసిక్‌గా నిలబెట్టాయి.
మరోవైపు మమతా మోహన్‌దాస్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్టీఆర్, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'యమదొంగ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. కెరీర్ మంచి దశలో ఉండగానే క్యాన్సర్ బారిన పడినా, చికిత్సతో కోలుకుని మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
అరుంధతి లాంటి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న చిత్రాన్ని వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని మమతా చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా "ఆ పాత్రలో మమతా నటించి ఉంటే ఎలా ఉండేదో" అంటూ చర్చించుకుంటున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news