తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) ప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేస్తున్నప్పటికీ, వాటిని ఎలా నింపాలనే విషయంలో ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. గ్రామాలు, పట్టణాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా సూచనలు ఇవ్వడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, వృద్ధులు పత్రాల్లో ఏ వివరాలు నమోదు చేయాలో అర్థంకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 4,28,207 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. అనేక మంది ఓటర్లు నివాసాలు మార్చుకోవడంతో బీఎల్వోలు వారి ప్రస్తుత చిరునామాలను గుర్తించడం కష్టంగా మారింది. ముఖ్యంగా కామారెడ్డి వంటి మున్సిపల్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఒకే కుటుంబంలో ఉన్న అందరికీ ఫారాలు అందకపోవడం వల్ల కూడా ప్రజలు సందిగ్ధంలో పడుతున్నారు.
2002 నాటి ఓటరు జాబితా ఆధారంగా వివరాలు నమోదు చేయాలని ఎన్నికల అధికారులు సూచించినప్పటికీ, పాత జాబితాల్లో పేర్ల స్పెల్లింగ్ తప్పులు, ఇంటిపేరు మార్పులు, కుటుంబ వివరాల్లో వ్యత్యాసాలు ఉండటం ఓటర్లకు కొత్త సమస్యగా మారింది. కొందరి పేర్లు పాత జాబితాలో వేరే విధంగా ఉండగా, ప్రస్తుత జాబితాలో మరో విధంగా కనిపిస్తున్నాయి. వాటిని సరిచేయాలా లేక యథాతథంగా నమోదు చేయాలా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది.
అదే సమయంలో 2002 జాబితాలో పేర్లు లేని కోడళ్లు, తర్వాత ఓటర్లుగా నమోదైన మహిళలు తమ పుట్టింటి వివరాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి తల్లిదండ్రుల పేర్లు లేదా పాత ఓటరు వివరాలు దొరకకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు 2002 నాటి వయస్సు బదులు ప్రస్తుత వయస్సును నమోదు చేయాలా అనే విషయంలో అయోమయానికి గురవుతున్నారు.
వలస వెళ్లిన ఓటర్ల విషయంలో కూడా బీఎల్వోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫారాలు అందజేయడానికి ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నప్పటికీ, చాలామంది ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఉండటంతో ప్రక్రియ ఆలస్యం అవుతోంది. దీంతో సర్వే పూర్తిచేయడం సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు.
ఓటర్లు సరైన సమాచారం కోసం బీఎల్వోలు లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. పుకార్లు, అనధికారిక సూచనలను నమ్మకుండా అధికారిక మార్గదర్శకాల ప్రకారం మాత్రమే ఫారాలు నింపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇలాంటి సమస్యలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news