హైదరాబాద్ యువతలో వీకెండ్ సంస్కృతి వేగంగా మారుతోంది. ఒకప్పుడు వారాంతం వచ్చిందంటే సినిమాలు, పబ్‌లు, షాపింగ్ మాల్స్‌లతో కాలక్షేపం చేసేవారు. కానీ ఇప్పుడు అదే యువత కమ్యూనిటీ బైక్ రైడింగ్ వైపు ఆకర్షితమవుతోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఒకే అభిరుచులు కలిగిన వారు గ్రూపులుగా ఏర్పడి నగరానికి దూరంగా ఉన్న ప్రకృతి అందాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ కొత్త అనుభవాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ కొత్త ధోరణి యువతలో మాత్రమే కాకుండా ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, కుటుంబ సభ్యుల వరకు విస్తరిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనేక బైకింగ్ కమ్యూనిటీలు ప్రతి వారాంతంలో ప్రత్యేక రైడ్లను నిర్వహిస్తున్నాయి. ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో సభ్యులంతా చేరుకుని అక్కడి నుంచి సమిష్టిగా ప్రయాణం ప్రారంభిస్తారు. నగరానికి 80 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి కోట, అనంతగిరి కొండలు, పోచారం రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్, మెదక్ చర్చి వంటి పర్యాటక ప్రాంతాలు ఈ రైడ్లలో ప్రధాన గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. ప్రకృతి మధ్యలో ప్రయాణం చేయడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం, కొత్త వ్యక్తులను కలవడం ఈ రైడ్ల ప్రత్యేకతగా మారింది.
ఈ కమ్యూనిటీ రైడ్లలో పాల్గొనడానికి ప్రొఫెషనల్ బైకర్ కావాల్సిన అవసరం లేదు. సాధారణంగా బైక్ లేదా స్కూటీ కలిగిన ఎవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. కొందరు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి పిలియన్ రైడర్లుగా కూడా పాల్గొంటున్నారు. ప్రయాణానికి సంబంధించిన వివరాలు, రూట్ మ్యాప్‌లు, సమావేశ సమయాలు, భద్రతా సూచనలు అన్నీ ముందుగానే సామాజిక మాధ్యమాల ద్వారా సభ్యులకు తెలియజేస్తారు. దీంతో కొత్తగా చేరే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఈ రైడ్లలో అత్యంత ప్రాధాన్యం భద్రతకే ఇస్తున్నారు. నిర్వాహకులు ప్రతి ట్రిప్ ప్రారంభానికి ముందు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. హెల్మెట్, జాకెట్, గ్లోవ్స్, మోకాళ్ల రక్షణ కవచాలు వంటి భద్రతా పరికరాలను తప్పనిసరి చేస్తున్నారు. ప్రయాణం మొత్తం క్రమశిక్షణతో సాగేందుకు ప్రత్యేకంగా లీడ్ రైడర్లు, మార్షల్స్‌ను నియమిస్తున్నారు. ప్రమాదాలు లేదా వాహనాల సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించేందుకు వైద్య సహాయకులు, మెకానికల్ సపోర్ట్ బృందాలను కూడా వెంట తీసుకెళ్తున్నారు.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ ప్రయాణాలు పూర్తిగా స్వచ్ఛందంగా జరుగుతాయి. ఎవరి ఖర్చులు వారే భరిస్తూ స్నేహపూర్వక వాతావరణంలో ప్రయాణం కొనసాగుతుంది. వేగంగా నడపడం, రేసింగ్ చేయడం, ప్రమాదకర విన్యాసాలు చేయడం వంటి వాటికి పూర్తిగా నో చెబుతున్నారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహిస్తూ సురక్షిత ప్రయాణ సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
కేవలం వినోదం మాత్రమే కాకుండా సామాజిక చైతన్యానికి కూడా ఈ కమ్యూనిటీ రైడ్లు వేదికగా మారుతున్నాయి. మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన, రోడ్డు భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు బైకింగ్ గ్రూపులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ యునైటెడ్ బైకర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియన్ ప్రైడ్ రైడ్స్’లో వందలాది మంది పాల్గొని మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అలాగే పురుషుల ఆరోగ్య సమస్యలపై చర్చించేందుకు నిర్వహించే ‘ది డిస్టింగ్విష్డ్ జెంటిల్మెన్ రైడ్’లో ఈ ఏడాది 500 మందికి పైగా బైకర్లు పాల్గొనడం విశేషం.
సాంకేతికత, సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో ఈ కమ్యూనిటీలు మరింత విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు ఆన్లైన్ పరిచయాలకే పరిమితమైన వ్యక్తులు ఇప్పుడు నిజ జీవితంలో కలుసుకుని స్నేహాలను పెంపొందించుకుంటున్నారు. ఉద్యోగ ఒత్తిడులు, నగర జీవనశైలి వల్ల వచ్చే మానసిక అలసట నుంచి బయటపడేందుకు కూడా ఈ బైక్ రైడ్లు ఎంతో ఉపశమనంగా మారుతున్నాయి. ప్రకృతితో మమేకమవుతూ, కొత్త అనుభవాలను ఆస్వాదిస్తూ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ముందుకు సాగుతున్న ఈ కమ్యూనిటీ బైక్ రైడింగ్ ట్రెండ్ హైదరాబాద్ యువతలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ప్రస్తుతం ఇది కేవలం హాబీగా కాకుండా ఒక కొత్త జీవనశైలిగా మారిపోతోందని నిర్వాహకులు చెబుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news