సాంకేతిక రంగంలో హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మరింత వేగంగా పనిచేసేలా అత్యంత పలుచని సెమీకండక్టర్ నానోషీట్ తయారీ విధానాన్ని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ వినూత్న పరిశోధనకు తాజాగా పేటెంట్ కూడా లభించింది. తక్కువ ఖర్చుతో, అధిక సామర్థ్యంతో పనిచేసే ఈ సాంకేతికత భవిష్యత్తు ఎలక్ట్రానిక్ పరికరాల రూపురేఖలను మార్చే సామర్థ్యం కలిగి ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సోమ వేణుగోపాలరావు, డాక్టర్ ఎం.శ్రీసత్య భారతి, ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ రావి సాయిసంతోష్ కుమార్, డాక్టర్ చల్లా రాజేంద్రకుమార్‌లు కలిసి ఈ పరిశోధన చేపట్టారు. నాలుగు నెలల పాటు నిరంతరంగా సాగిన పరిశోధనల ఫలితంగా ఈ వినూత్న విధానాన్ని అభివృద్ధి చేశారు.
ప్రస్తుతం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే నానోషీట్లలో సాధారణంగా 28 పొరలు ఉంటాయి. ఈ పొరలను వేరు చేయడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియగా భావిస్తారు. అయితే పరిశోధకులు ‘బస్సెల్ బీమ్’ అనే ప్రత్యేక లేజర్ కాంతి సాంకేతికతను ఉపయోగించి ఆ 28 పొరలను అత్యంత వేగంగా విడదీయగలిగారు. ఈ ప్రక్రియలో సెకనులో క్వాడ్రిలియన్ వంతు సమయం మాత్రమే పట్టడం విశేషం.
పరిశోధకుల ప్రకారం ఒకటి లేదా రెండు పొరలతో కూడిన అత్యంత పలుచని నానోషీట్లను వినియోగించడం ద్వారా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో డేటా బదిలీ వేగం గణనీయంగా పెరుగుతుంది. దీంతో భవిష్యత్తులో సమాచార ప్రాసెసింగ్ మరింత వేగవంతం కావడంతో పాటు పరికరాల పనితీరు కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
ఈ సాంకేతికత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాకుండా మొబైల్ ఫోన్ల రంగానికీ విస్తరించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ముఖ్యంగా మడతపెట్టే స్మార్ట్ఫోన్లు, వంపులు తిప్పగలిగే ల్యాప్‌టాప్‌లు, ఆధునిక టాబ్లెట్ల తయారీలో ఈ పలుచని నానోషీట్లు కీలక పాత్ర పోషించగలవని తెలిపారు. భవిష్యత్తు తరానికి చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల అభివృద్ధికి ఈ పరిశోధన కొత్త దారులు చూపనుంది.
సెమీకండక్టర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్ శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణంగా నిలిచింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విధానం భవిష్యత్తులో ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news