కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటరు సర్వే ప్రక్రియ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాదాస్పదంగా మారుతోంది. ఓటర్ల వివరాల సేకరణ, ధృవీకరణ కోసం నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ విధానంలో తీవ్రమైన లోపాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు బూత్ స్థాయి అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులకు లేదా కార్యకర్తలకు పత్రాలను అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పారదర్శకంగా జరగాల్సిన ఓటరు సర్వే ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనల ప్రకారం బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేయాలి. ఇంట్లో ఎవరూ లేకపోతే మరోసారి, అవసరమైతే మూడోసారి కూడా వెళ్లి అందించాలి. ఎవరూ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇంటి తలుపు లేదా కిటికీ ద్వారా పత్రాలను వదిలివేయాల్సి ఉంటుంది. అయితే కొందరు అధికారులు ఈ ప్రక్రియను భారంగా భావించి రాజకీయ పార్టీల సహాయంతో పనిని ముగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నిజమైన ఓటర్లకు పత్రాలు అందకుండా పోయే ప్రమాదం ఏర్పడుతోంది.
హైదరాబాద్లోని పాతబస్తీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలతో పాటు కూకట్పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తమకు సంబంధించిన పత్రాల కోసం రాజకీయ పార్టీ కార్యాలయాలు, స్థానిక నేతల ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీ కార్యకర్తలే ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఓటర్ల మధ్య వివక్ష చోటుచేసుకుంటోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకే కాలనీ లేదా బస్తీలో కొందరికి పత్రాలు అందగా మరికొందరికి అందకపోవడం వల్ల గందరగోళం నెలకొంటోంది. దీనిపై ప్రశ్నిస్తే ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇవ్వలేకపోయామని కొందరు బీఎల్వోలు సమాధానం చెబుతున్నట్లు ఓటర్లు పేర్కొంటున్నారు.
మలక్పేట్ నియోజకవర్గంలోని ఒక ప్రాంతంలో ఓటరు ఫోన్ చేసి పత్రాల గురించి అడగగా, స్థానిక పార్టీ కార్యాలయంలో ఉన్న వ్యక్తిని సంప్రదించాలని బీఎల్వో సూచించినట్లు సమాచారం. అదే విధంగా సికింద్రాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ప్రాంగణాల్లో పత్రాల పంపిణీ జరుగుతోందని, కార్యకర్తలే సంతకాలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలోని పలు డివిజన్లలో కూడా రాజకీయ అనుచరులే పత్రాలను అందజేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎన్యూమరేషన్ పత్రాలు సరైన వ్యక్తులకు అందకపోతే భవిష్యత్తులో ఓటరు జాబితాల్లో పేర్లు లేకపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన హక్కు కావడంతో ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఓటరు సర్వే ప్రక్రియను అధికారులు మరింత పర్యవేక్షించి, బీఎల్వోలు నేరుగా ఇంటింటికీ వెళ్లి పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాలంటే పారదర్శకత, సమానత్వం తప్పనిసరి అని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వస్తున్న ఫిర్యాదులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news