జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి భారత పర్యటనతో భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సెమీకండక్టర్ రంగం మరోసారి ప్రధాన చర్చాంశంగా మారింది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, సరఫరా గొలుసుల భద్రత, పెట్టుబడులు, సాంకేతికత, ఆర్థిక భద్రత వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీ, సరఫరా వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో ఈ భాగస్వామ్యం ఇరు దేశాలకు కీలకంగా మారుతోంది ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెమీకండక్టర్లు అత్యంత వ్యూహాత్మక రంగంగా మారాయి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, విద్యుత్ వాహనాలు, వైద్య పరికరాలు, రక్షణ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష పరిశోధనలు వంటి దాదాపు ప్రతి రంగంలో చిప్‌ల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సరఫరా గొలుసులను మరింత బలోపేతం చేయడం, ఒకే దేశంపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాలను అభివృద్ధి చేయడం ప్రపంచ దేశాల ప్రధాన లక్ష్యంగా మారింది
భారత్ సెమీకండక్టర్ తయారీ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ముందుకు సాగుతోంది. మరోవైపు జపాన్‌కు అధునాతన చిప్ తయారీ, ప్రత్యేక పదార్థాలు, యంత్రాలు, పరిశోధనలో విశేష అనుభవం ఉంది. ఈ రెండు దేశాల బలాలు కలిస్తే ప్రపంచ సరఫరా గొలుసులో కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సనాయే తకైచి భారత పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో సెమీకండక్టర్లతో పాటు కీలక ఖనిజాలు, పెట్టుబడులు, రక్షణ సహకారం, సముద్ర భద్రత, ఆర్థిక భద్రత, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం వంటి అంశాలు కూడా ప్రధాన అజెండాలో ఉన్నాయి. ఈ పర్యటన ద్వారా ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి
Fetching videos...
Fetching latest news...
No trending news