కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాళెం జెడ్పీ హైస్కూల్‌ను అన్ని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. గురువారం పాఠశాలలో అభివృద్ధి చేసిన తరగతి గదులు, ‘వీపీఆర్ అమృతధార’ తాగునీటి ప్లాంట్‌ను ప్రారంభించిన ఆమె, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
గతంలో నిర్వహించిన పేరెంట్స్–టీచర్స్ సమావేశం సందర్భంగా పాఠశాలను పరిశీలించినప్పుడు అనేక సమస్యలు కనిపించాయని ఎమ్మెల్యే తెలిపారు. తరగతి గదుల కొరత, లైబ్రరీని స్టోర్‌రూమ్‌గా మార్చడం, అపరిశుభ్ర వాతావరణం వంటి అంశాలు గమనించామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అసంపూర్తిగా వదిలేసిన పనుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
వీపీఆర్ ఫౌండేషన్, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా పాఠశాల అభివృద్ధికి మొదట రూ.15 లక్షలు ప్రకటించామని, ప్రస్తుతం దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇంకా మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేసి పాఠశాలను విద్యార్థులకు అంకితం చేస్తామని తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు బెంచీలు, సైకిళ్లు కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాలలో తాగునీటి సమస్యను గుర్తించి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ‘వీపీఆర్ అమృతధార’ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా నెల్లూరు జిల్లాలో 200కు పైగా తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశామని, కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే 28 ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రశాంతి రెడ్డి చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారం, యూనిఫారాలు, అవసరమైన అన్ని వసతులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు కిచెన్ నుంచి భోజనం తెచ్చుకుని వరండాలో కూర్చుని తినే పరిస్థితి మారాలని ఎమ్మెల్యే అన్నారు. ఇకపై పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థుల వద్దకే భోజనం తీసుకెళ్లి వడ్డించే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు. కోవూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే విధానం అమలు కావాలని కోరారు.
ఈ సందర్భంగా వీపీఆర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘వీపీఆర్ నేత్ర’ కార్యక్రమం గురించి కూడా వివరించారు. కొడవలూరు మండలంలో 24 రోజుల పాటు నిర్వహించిన కంటి వైద్య శిబిరాల ద్వారా 8,438 మందికి పరీక్షలు నిర్వహించామని, వారిలో 5,706 మందికి ఉచిత కళ్లజోళ్లు అందించామని తెలిపారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య సేవలు కూడా అందిస్తున్నామని చెప్పారు.
ప్రజాసేవే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి రంగాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువవుతామని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news