అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అధ్యక్ష అధికారాలను వినియోగిస్తూ ఆరుగురికి క్షమాభిక్ష ప్రకటించారు. వాహనాల ఉద్గార నియంత్రణ వ్యవస్థల్లో మార్పులు చేసిన కేసుల్లో శిక్షలు ఎదుర్కొన్న లేదా విచారణను ఎదుర్కొంటున్న ఈ వ్యక్తులు కేవలం తమ కార్లను సవరించుకున్నందుకే అన్యాయంగా లక్ష్యంగా మారారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కేసులు గత ప్రభుత్వ కాలంలో అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆయన ఆరోపిస్తూ, వారిని వెంటనే విముక్తి చేస్తున్నట్లు ప్రకటించారు
ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదికలో చేసిన ప్రకటనలో, ఈ వ్యక్తులు నేరస్థులు కాదని, తమ వాహనాలను మరమ్మతు చేయడం లేదా పనితీరును మెరుగుపరచే మార్పులు చేయడమే వారి తప్పుగా చూపించారని పేర్కొన్నారు. "వారందరినీ ఇప్పుడే పూర్తిగా స్వేచ్ఛ కల్పిస్తున్నాను" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఈ కేసులన్నీ ప్రధానంగా అమెరికా స్వచ్ఛ గాలి చట్టానికి సంబంధించిన ఉద్గార నిబంధనల ఉల్లంఘనలపై నమోదయ్యాయి. వాహనాల్లో కాలుష్య నియంత్రణ పరికరాలను తొలగించడం, ఉద్గార నియంత్రణ వ్యవస్థలను పనిచేయకుండా చేసే పరికరాలు లేదా సాఫ్ట్వేర్ను విక్రయించడం, అమర్చడం వంటి ఆరోపణలతో వీరిపై ఫెడరల్ కేసులు నమోదయ్యాయి. అయితే ట్రంప్ వీటిని సాధారణ వాహన మార్పులుగా అభివర్ణిస్తూ, క్రిమినల్ కేసులుగా పరిగణించడం సరైంది కాదన్నారు
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పర్యావరణ నిబంధనల అమలుపై తన ప్రభుత్వ వైఖరిని మార్చారు. ముఖ్యంగా వాహనాల మార్పులకు సంబంధించిన క్రిమినల్ విచారణలను తగ్గించాలని న్యాయశాఖకు సూచనలు ఇచ్చినట్లు ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన క్షమాభిక్షలు ఆయన విధానానికి కొనసాగింపుగా భావిస్తున్నారు.
వైట్ హౌస్ వర్గాల ప్రకారం, ఈ క్షమాభిక్షలు అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా చేపట్టిన "250 సంవత్సరాలకు 250 క్షమాభిక్షలు" కార్యక్రమంలో భాగంగా ప్రకటించబడ్డాయి. దేశ చరిత్రలో ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని గతంలో అన్యాయంగా శిక్షించబడ్డారని భావించిన కొందరికి ఉపశమనం కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని పేర్కొన్నారు
Fetching videos...
Fetching latest news...
No trending news