విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేక మాజీ ముఖ్యమంత్రి జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని, ఢిల్లీలో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో కడప స్టీల్ ప్లాంట్ వంటి కీలక ప్రాజెక్టులు పూర్తికాలేదని, ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు జరగలేదని ఆయన అన్నారు. ప్రస్తుతం విద్య, ఐటీ, నీటిపారుదల, మౌలిక వసతులు, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో రాష్ట్రం వేగంగా పురోగమిస్తోందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రశంసించారని, ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news