విజయవాడ బస్టాండ్ సమీపంలోని స్క్రాప్ పార్క్లో స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి విగ్రహ నిర్మాణానికి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. వంగవీటి మోహనరంగా గారి 79వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. రాధా–రంగా మిత్రమండలి సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగా గారికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన ప్రజానాయకుడని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపు సహా అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరిస్తూ, కులమతాలకు అతీతంగా ప్రజా సేవనే తన జీవిత లక్ష్యంగా తీసుకున్న మహానేతగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
1980వ దశకంలో విజయవాడ నగరంలో నెలకొన్న రౌడీయిజం, భయానక పరిస్థితుల మధ్య సామాన్య ప్రజలు, మహిళలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో అన్యాయానికి ఎదురొడ్డి నిలబడి పేదల పక్షాన పోరాడిన ధైర్యవంతుడు రంగా గారని చెప్పారు. ఏ బలహీన వర్గం సమస్య అయినా వెంటనే స్పందించి న్యాయం జరిగే వరకు పోరాటం చేసిన నాయకుడిగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు.
మహిళలపై అఘాయిత్యాలు, పేదలపై దౌర్జన్యాలు, బలహీన వర్గాలపై దాడులు జరిగిన ప్రతి సందర్భంలో రంగా గారు నిర్భయంగా ప్రజల తరఫున నిలబడి ఉద్యమాలు చేసినట్టు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్షలు, ఆందోళనలు నిర్వహిస్తూ ప్రభుత్వాలను సైతం స్పందింపజేసిన అరుదైన నాయకుడిగా ఆయన పాత్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయిందన్నారు.
ఈ విగ్రహాన్ని దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. వంగవీటి మోహనరంగా గారు నిరాహార దీక్ష చేసిన భంగిమలో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారని, పనులను వేగంగా పూర్తి చేసి డిసెంబర్ 26న ఆయన వర్ధంతి సందర్భంగా వేలాది మంది అభిమానుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరిస్తామని వెల్లడించారు.
రంగా గారి ఆశయాలు, ప్రజాసేవా భావనను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బొండా ఉమా పేర్కొన్నారు. పేదలు, బలహీన వర్గాలు, మహిళలకు అండగా నిలుస్తూ రంగా గారు చూపిన మార్గంలోనే ముందుకు సాగుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాధా–రంగా మిత్రమండలి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news