ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మరియు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న విజయవాడలో భారీ స్థాయి మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు.
నంద్యాలలోని మంత్రి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని మైనారిటీ యువత నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోందని వెల్లడించారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సుమారు 60 నుండి 70 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలను ఈ జాబ్ మేళాలో పాల్గొనేటట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ మెగా జాబ్ మేళా ద్వారా వేలాది మంది మైనారిటీ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గత పాలనలో నిరుద్యోగ సమస్యపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
యువత తమ విద్య, నైపుణ్యాలను వినియోగించుకుని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను యువత తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
జులై 11న విజయవాడలోని ముసాఫిర్ ఖానా (పంజా సెంటర్)లో జరగనున్న ఈ మెగా జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరై ఉపాధి అవకాశాలను పొందాలని నిర్వాహకులు కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news