పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో నూతనంగా నిర్మించిన తహసిల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకటగురుమూర్తి, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ సంయుక్తంగా ప్రారంభించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ కార్యాలయం ద్వారా రెవెన్యూ సేవలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ 2014–19లో రూపొందించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయ ప్రణాళిక ఇప్పుడు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కృషితో ఈ కార్యాలయం ప్రజలకు అంకితం కావడం అభినందనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు.
భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటివరకు 7.5 లక్షలకు పైగా వచ్చిన అర్జీలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేశామని, రీ-సర్వేలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ వేలాది గ్రామాల్లో వెబ్‌ల్యాండ్ పోర్టింగ్ పూర్తి చేశామని వివరించారు.
రైతులకు ఆధునిక భద్రతా ప్రమాణాలతో కొత్త పాస్‌పుస్తకాలు అందిస్తున్నామని, భూముల సబ్‌డివిజన్‌ను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే షరతుల గల పట్టాలు, డాట్-సీ భూములు, 22-ఏ నిషేధిత జాబితా, దేవాదాయ ఇనాం భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై పెట్టుబడిదారులకు ఉన్న విశ్వాసమే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు.
ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరులో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన 2014–19లోనే ప్రారంభమైందని తెలిపారు. దాత సజ్జా వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి భూమిని విరాళంగా ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు సాధ్యమైందన్నారు. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన యనమలకుదురు వంతెన, సిద్ధార్థ కళాశాల ఫ్లైఓవర్, మద్దూరు–ఉప్పులూరు రహదారి, పుల్లేరు బ్రిడ్జి వంటి అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం వేగం తీసుకొచ్చిందని చెప్పారు. త్వరలో ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు కానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news