చైనా టెక్నాలజీ దిగ్గజం షావోమీ భారత్‌లో తన కొత్త ఉప బ్రాండ్ మిజియాను ప్రారంభించింది. స్మార్ట్ఫోన్ల రంగంలో ఇప్పటికే బలమైన స్థానాన్ని సంపాదించిన షావోమీ, ఇప్పుడు పెద్ద గృహోపకరణాల విభాగంలో తన పరిధిని విస్తరించేందుకు ఈ కొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చింది. ఇకపై భారత్‌లో విక్రయించే హోమ్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు మిజియా బై షావోమీ పేరుతో అందుబాటులోకి రానున్నాయి.
షావోమీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మిజియా అంటే ‘మి హోమ్’ అని అర్థం. ఇది సంస్థకు చెందిన ప్రపంచవ్యాప్త హోమ్, లైఫ్‌స్టైల్ బ్రాండ్. ఇప్పటికే షావోమీకి చెందిన రెడ్మీ, పోకో బ్రాండ్ల సరసన మిజియా కూడా చేరనుంది. ఈ బ్రాండ్ ద్వారా ఎయిర్ ప్యూరిఫైయర్లు వంటి గృహ వినియోగ ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందించనున్నారు.
మిజియా ప్రారంభం షావోమీ తీసుకొచ్చిన విస్తృత వ్యూహంలో భాగమని సంస్థ తెలిపింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ‘హ్యూమన్ ఎక్స్ కార్ ఎక్స్ హోమ్’ వ్యూహాన్ని భారత్‌లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానంలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ హోమ్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలను ఒకే అనుసంధానిత వ్యవస్థలోకి తీసుకురావాలని షావోమీ భావిస్తోంది.
ఈ మొత్తం వ్యవస్థకు షావోమీ హైపర్ఓఎస్ సాఫ్ట్వేర్ కీలకంగా పనిచేస్తుంది. వివిధ స్మార్ట్ పరికరాలు ఒకదానితో ఒకటి సులభంగా అనుసంధానం కావడం ద్వారా వినియోగదారులకు మెరుగైన అనుభవం అందుతుందని సంస్థ పేర్కొంది. భారత్‌లో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, ఏఐ ఆధారిత ఉత్పత్తుల విభాగాల్లో ఇప్పటికే తన ఉనికిని చాటుకున్న షావోమీ, ఇప్పుడు హోమ్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
షావోమీ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీన్ మాథుర్ మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా భారత వినియోగదారులతో కలిసి షావోమీ తన ఉత్పత్తుల పరిధిని విస్తరించుకుంటూ వచ్చిందన్నారు. స్మార్ట్‌ఫోన్ సంస్థగా ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు విస్తృత వినియోగదారుల సాంకేతిక పరిష్కారాల సంస్థగా ఎదుగుతోందని తెలిపారు.
మిజియా బై షావోమీ ప్రారంభం భారత్‌లో ‘హ్యూమన్ ఎక్స్ కార్ ఎక్స్ హోమ్’ వ్యూహంలో కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత తెలివైన, సులభమైన, అనుసంధానిత స్మార్ట్ జీవన విధానాన్ని భారత కుటుంబాలకు అందించడమే లక్ష్యమని వివరించారు.
షావోమీ 2014లో భారత్ మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్ సంస్థగా ప్రవేశించింది. తక్కువ కాలంలోనే భారీ వినియోగదారులను సంపాదించుకుంది. ఆ తర్వాత స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, ఏఐఓటీ ఉత్పత్తుల వంటి విభాగాల్లోకి విస్తరించింది. ప్రస్తుతం మిజియా బ్రాండ్ ద్వారా పెద్ద గృహోపకరణాల మార్కెట్లోకి అడుగుపెట్టి తన పర్యావరణ వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news