అమరావతిలో ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వైఖరిపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతున్న సమయంలో బొప్పరాజు ఉద్యోగులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యల అజెండాతో పనిచేస్తున్నారా, లేక రాజకీయ అజెండాతో ముందుకు సాగుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి ప్రశ్నించారు.
వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన అనగాని సత్యప్రసాద్.. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సఖ్యతను దెబ్బతీసేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై బొప్పరాజుతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో పెట్టిన బిల్లులను కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో ప్రభుత్వం ఉద్యోగుల కోసం చేసిన ఆర్థిక చెల్లింపుల గురించి బొప్పరాజు కనీసం ప్రస్తావించకపోవడం ఆయన వైఖరిని తెలియజేస్తోందని విమర్శించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల్లో చాలా వరకు ఇప్పటికే చెల్లించామని, మిగిలిన వాటిని కూడా విడతల వారీగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
పదకొండు వేల మంది సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని వర్తింపజేశామని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ ఉద్యోగుల వాటాగా ఉన్న నిధులను ఇతర అవసరాలకు ఉపయోగించారని ఆరోపించారు. ఉద్యోగుల ఖాతాల్లోని సొమ్మును కూడా గత పాలనలో వినియోగించారని, ఆ మొత్తాలను తిరిగి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించామని స్పష్టం చేశారు.
ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం గౌరవిస్తుందని, వారి సమస్యలపై చర్చించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇవ్వడంతో పాటు జీతాల నుంచి రికవరీలు చేశారని విమర్శించారు. ఈ అంశాలను బొప్పరాజు మరిచిపోయారో, మరిచినట్లు నటిస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
జగన్ హయాంలో జరిగిన పరిణామాలకు సంబంధించిన బాధ్యతలను కూడా కూటమి ప్రభుత్వంపై వేసేలా బొప్పరాజు ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారని అనగాని ఆరోపించారు. ఉద్యోగులు బొప్పరాజు వ్యవహారశైలిని గమనించాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేలా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల అజెండా కంటే రాజకీయ అజెండాకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించేలా, అవహేళన చేసేలా బొప్పరాజు సభ నిర్వహించారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రశ్నించడం, ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యమాలు చేయడాన్ని తాము గౌరవిస్తామని, అయితే కుట్రపూరితంగా ముఖ్యమంత్రిని అవహేళన చేసే చర్యలను మాత్రం సహించబోమని హెచ్చరించారు. బొప్పరాజుతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, ప్రస్తుత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో ఉద్యోగులు గమనించాలని అనగాని సత్యప్రసాద్ సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news