నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుంది. ఆగస్టు 31న మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను జాతికి అంకితం చేయనున్నారు. వెలిగొండ గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేయడంతో కరవు నేలల్లో కొత్త ఆశలు చిగురించనున్నాయి. ఈ చారిత్రక ఘట్టంపై నందిగామ శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య హర్షం వ్యక్తం చేశారు.
కృష్ణా నది ఒడ్డున పెరిగిన ప్రజలకు కృష్ణమ్మ జీవనాధారమని, అయితే నల్లమల కొండలకు అవతల ఉన్న ప్రాంతాలు ఎన్నో దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూశాయని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం, తాగునీటి సమస్యలు, ఫ్లోరైడ్ ప్రభావం వంటి సమస్యలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు అందుబాటులోకి రావడం కేవలం నీటి మళ్లింపు కాదని, ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తును మార్చే పరిణామమని పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ఆలోచనకు 1985లో నందమూరి తారక రామారావు హయాంలో బీజం పడిందని, 1994లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైందని వివరించారు. 1996 మార్చి 5న గొట్టిపడియ వద్ద చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని, అనంతరం పలు అనుమతులు, పనుల ప్రారంభానికి చర్యలు జరిగాయని తెలిపారు. ఇప్పుడు అదే చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం కావడం ప్రత్యేకతగా పేర్కొన్నారు.
ప్రాజెక్టు నిర్మాణంలో నిధుల కొరత, అటవీ అనుమతులు, సాంకేతిక సమస్యలు వంటి అనేక సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. గత ఐదేళ్లలో పనులు మందగించాయని, సొరంగాలు, ఫీడర్ కాలువకు సంబంధించిన పనులు పూర్తికాకపోవడంతో నీటి విడుదల సాధ్యం కాలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రారంభోత్సవం జరిగినప్పటికీ నీరు రాలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు చెల్లించడం, సొరంగాల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించడం, యంత్రాలను బయటకు తీసుకురావడం వంటి పనులను వేగంగా చేపట్టిందని తెలిపారు. కేవలం 26 నెలల్లో రూ.2,402 కోట్లు ఖర్చు చేసి పెండింగ్ పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా సొరంగ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 43.50 టీఎంసీల కృష్ణా వరద జలాలు గురుత్వాకర్షణ ఆధారంగా 18.8 కిలోమీటర్ల జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు చేరనున్నాయి. నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో సొరంగాల నిర్మాణం సాంకేతికంగా సవాలుగా మారినా ఇంజినీర్లు, కార్మికులు పట్టుదలతో పనులు పూర్తి చేశారని తెలిపారు.
వెలిగొండ కోసం తమ గ్రామాలను, భూములను వదులుకున్న నిర్వాసిత కుటుంబాల త్యాగాలను తంగిరాల సౌమ్య ప్రత్యేకంగా గుర్తుచేశారు. పదకొండు గ్రామాల ప్రజలు పునరావాసం కోసం చేసిన త్యాగానికి గౌరవంగా పరిహారం అందిస్తున్నామని తెలిపారు. 6,206 కుటుంబాలకు మూడు విడతల్లో రూ.768 కోట్ల పరిహారం జమ చేసినట్లు, నిర్వాసిత యువత కోసం అదనంగా రూ.169 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
వెలిగొండ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 4,47,300 ఎకరాలకు సాగునీరు, 30 మండలాలకు ప్రయోజనం, సుమారు 15.25 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య తగ్గడంతో పాటు వ్యవసాయం, పారిశ్రామిక రంగం, ఉద్యానవన అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. రైతులు వలసలు వెళ్లకుండా సొంత ప్రాంతాల్లోనే ఉపాధి పొందే పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు ప్రారంభం కాదని, నలభై ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికే చారిత్రక ఘట్టమని తంగిరాల సౌమ్య అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఇంజినీర్లు, అధికారులు, కార్మికులు, ముఖ్యంగా నిర్వాసిత కుటుంబాల కృషి, త్యాగాలను ఆమె అభినందించారు. కృష్ణమ్మ కరవు నేలల్లోకి అడుగుపెడుతున్న ఈ రోజు ప్రాంత ప్రజల జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news