శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీని పోలీసులు విచారించారు. చాపురంలో రూ.4 కోట్ల విలువైన భూమిని బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చూపించి తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న ఈ వ్యవహారంపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో తమ్మినేని సీతారాం, వాణిశ్రీ దంపతులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు.
కేసు దర్యాప్తులో భాగంగా రూరల్ పోలీసులు ఇటీవల తమ్మినేని సీతారాంను విచారించారు. తాజాగా శనివారం ఆయన సతీమణి వాణిశ్రీని కూడా విచారణకు పిలిచారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కరణం వెంకట సురేశ్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆమెను విచారించినట్లు సమాచారం. భూమి కొనుగోలుకు డబ్బులు ఎలా చెల్లించారు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎవరు సహకరించారు, కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతోనే భూమిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించారు వంటి ప్రశ్నలను పోలీసులు అడిగినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారానికి సంబంధించి తనకు తెలిసిన వాస్తవాలను వెల్లడించాలని పోలీసులు ప్రశ్నించగా, వాణిశ్రీ ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అంటూ సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మరిన్ని వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. భూమి రిజిస్ట్రేషన్, నగదు చెల్లింపులు, సంబంధిత పత్రాలు, రిజిస్ట్రేషన్ సమయంలో సహకరించిన వ్యక్తుల వివరాలను పరిశీలించే అవకాశం ఉంది.
ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని పోలీసులు వాణిశ్రీకి సూచించినట్లు తెలుస్తోంది. దీనికి ఆమె కేసు విషయంలో పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు హైకోర్టు నుంచి బెయిల్ పొందిన తమ్మినేని సీతారాం, వాణిశ్రీ దంపతులు బెయిల్‌కు సంబంధించిన రూ.50 వేల బాండు పత్రాలు, పూచీకత్తులను పోలీస్ స్టేషన్లో సమర్పించారు.
భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటి, ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరిగింది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణలో సేకరించే వివరాలు, సంబంధిత పత్రాల పరిశీలన ఆధారంగా కేసులో తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. ఈ వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.
Fetching videos...
Fetching latest news...
No trending news