విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ‘పేదల సేవలో’ కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 24వ డివిజన్ పుష్ప హోటల్ సెంటర్ పరిధిలోని కాజా ముసలయ్య వీధిలో, అనంతరం 26వ డివిజన్ మారుతీనగర్ కాలువ ఒడ్డు, గద్దె పూర్ణచంద్రరావు వీధిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల జీవితాల్లో పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. గతంలో పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక నెల పింఛన్ వస్తే మరో నెల వస్తుందో లేదో తెలియని పరిస్థితులు ఉండేవని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ వ్యవస్థను సరళీకృతం చేసి, పారదర్శకత, జవాబుదారీతనంతో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారి ఇళ్ల వద్దకే పింఛన్లు అందించే విధంగా వ్యవస్థను పటిష్టం చేసిందని బొండా ఉమా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గతంలో రూ.3,000గా ఉన్న పింఛన్‌ను రూ.4,000కు పెంచామని, వికలాంగుల పింఛన్‌ను రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచామని చెప్పారు. మంచానికే పరిమితమైన వారికి రూ.10,000, తలసేమియా బాధితులకు రూ.15,000 పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి నెలా వేకువజామునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించడం వల్ల వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. లబ్ధిదారులు తమకు ఆశీస్సులు అందిస్తున్నప్పుడు తమ జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నామని తెలిపారు. తమకు అధికారం అలంకారం కాదని, ప్రజలకు సేవ చేయడానికి లభించిన బాధ్యత అని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ తమకు గుర్తుందని, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు.
తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని బొండా ఉమా తెలిపారు. మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18,000 అందించే హామీని కూడా త్వరలో అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తులోనూ నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు.
కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు సకాలంలో అందించడం ద్వారా ప్రభుత్వం ప్రజల పట్ల తన బాధ్యతను చాటుకుంటోందని పేర్కొన్నారు.
విజయవాడ నగర ప్రజల చిరకాల వాంఛ అయిన సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేశినేని చిన్ని తెలిపారు. జి.ఓ. నెం.30 ద్వారా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడ నగర పరిధిలో సుమారు 40 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విజయవాడకు తీసుకువచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించడమే తమ లక్ష్యమని కేశినేని చిన్ని అన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారని చెప్పారు. ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, వల్లభనేని సతీష్, తోట పాండు, 24వ డివిజన్ అధ్యక్షులు జాడ దుర్గారావు, గుడ్డేటి మురళి, సురవరపు నాగరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజన్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు పేదల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news