మచిలీపట్నం బందరులో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, కృష్ణుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
బందరుకోట రామాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు నైవేద్యం సమర్పించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులతో కలిసి కోలాటం, కర్రసాము కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉట్టి కొట్టి కృష్ణాష్టమి సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. భక్తులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు.
గొడుగుపేటలో శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పిల్లల ఆధ్వర్యంలో జరిగిన పోటీలు, నృత్య ప్రదర్శనల్లో మంత్రి పాల్గొన్నారు. బాల గోపాలులతో సరదాగా గడిపి వారిని ఉత్సాహపరిచారు. బృందావన్ థియేటర్లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లోనూ మంత్రి పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
సర్కిల్ పేటలోని సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానాన్ని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆర్.గొల్లపాలెం గ్రామంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. సర్కిల్ పేటలోని తన గోశాలకు వెళ్లి గోవులకు పలహారం అందించారు. నిజాంపేట బొమ్మలమెడ ఆలయంలో జరిగిన వేడుకల్లోనూ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, కృష్ణాష్టమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, సమాజానికి గొప్ప సందేశాన్ని అందించే పవిత్రమైన సందర్భమని పేర్కొన్నారు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించేందుకు, దుష్టులను శిక్షించేందుకు భగవంతుడు అవతరిస్తాడనే నమ్మకాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి చాటిచెబుతుందని అన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే, మనలను రక్షించే బాధ్యతను ఆ పరమాత్ముడు తీసుకుంటాడనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడు మానవాళికి ధర్మ మార్గాన్ని, కర్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ద్వారా అందించారని మంత్రి తెలిపారు. సమాజంలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తిశ్రద్ధలతో ఇలాంటి వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. గోపాలకృష్ణుడి కృపాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ భక్తితో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news