అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్-1 స్థానంలో నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 57వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన, వివిధ కాలనీల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విని అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు 57 సార్లు ప్రజా దర్బార్ నిర్వహించి 1,268 అర్జీలను స్వీకరించినట్లు దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కేవలం 39 అర్జీలు మాత్రమే వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ప్రతి వారం ప్రజల సమస్యలను తెలుసుకునే కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల సమస్యలను తెలుసుకునే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఆ కాలంలో రాష్ట్రం వినాశనం దిశగా వెళ్లిందని ఆరోపించారు. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవం, దూరదృష్టితో రెండేళ్లలోనే రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకువస్తున్నారని చెప్పారు.
దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో గణనీయమైన వాటా ఆంధ్రప్రదేశ్‌కు వస్తోందని దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. చిత్తూరు జిల్లాలో మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమ, అనంతపురం జిల్లాలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ, కర్నూలు జిల్లాలో డ్రోన్ల తయారీతో పాటు శీతలీకరణ పరికరాల తయారీ వంటి పరిశ్రమలను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
అనంతపురం జిల్లాను ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత రెండేళ్లలో రూ.1,296 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు.
గత వైసీపీ పాలనలో నియోజకవర్గానికి టన్నుల కొద్దీ చెత్తను మిగిల్చారని దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగించే పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించడమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. అనంతపురం అర్బన్‌ను రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం పనిచేస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news