పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్ తీరప్రాంత మత్స్యకారులు తీవ్రమైన జీవన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. తరతరాలుగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఇప్పుడు తమ ఉపాధిని కోల్పోయే పరిస్థితికి చేరుకున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా విదేశీ భారీ ట్రాలర్ నౌకలు, ముఖ్యంగా చైనా సంస్థలకు చెందిన మత్స్య వేట నౌకల కార్యకలాపాలనే వారు ఆరోపిస్తున్నారు. తీర ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా చేపల వేట సాగించడం వల్ల చిన్న మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని వారు చెబుతున్నారు.
సియెర్రా లియోన్ రాజధాని ఫ్రీటౌన్కు దక్షిణంగా ఉన్న షెర్బో ద్వీపంలో తీర ప్రాంత చేపల వేట ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగుతోంది. గ్రామస్థులు కలిసి పెద్ద వలలను సముద్రంలో వేసి, అనంతరం అందరూ కలసి తాడులను లాగుతూ వలలను ఒడ్డుకు తీసుకువస్తారు. ఈ ప్రక్రియలో అనేక మంది ఒకేసారి శ్రమించాల్సి ఉంటుంది. వలల్లో స్నాపర్, మాకరెల్, బారాకూడా, రే చేపలు, సార్డిన్లతో పాటు అనేక రకాల సముద్ర జీవులు చిక్కుతాయి. ఈ వేటపై ఆధారపడే కుటుంబాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు.
అయితే గత కొన్నేళ్లుగా చేపల లభ్యత గణనీయంగా తగ్గిపోయిందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. గతంలో ఒకసారి వల వేసినా మంచి మొత్తంలో చేపలు దొరికేవని, ఇప్పుడు అదే శ్రమ చేసినా చాలా తక్కువ చేపలు మాత్రమే లభిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల నిల్వలు తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని చెబుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news