ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో రోడ్డు కుంగిపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. కమలా నగర్ ప్రాంతంలోని కర్మయోగి ఎన్క్లేవ్ కూడలి సమీపంలో ఉన్న రహదారి నెల రోజుల్లోనే మూడోసారి కుంగిపోయింది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 20 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పుతో ఏర్పడిన ఈ గుంత నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యాన్ని బయటపెట్టిందని స్థానికులు ఆరోపించారు.
రోడ్డు దుస్థితికి నిరసనగా సమాజ్వాదీ పార్టీ నేత నితిన్ కోహ్లీ వినూత్నంగా నిరసన తెలిపారు. చెక్క నిచ్చెన సహాయంతో రోడ్డులో ఏర్పడిన భారీ గుంతలోకి దిగారు. అక్కడి నుంచి రహదారి నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తారు. గుంత లోతును స్వయంగా కొలిచి, కొబ్బరికాయలు కొట్టి, పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డు కుంగిన విషయం తెలుసుకున్న వెంటనే ఆసక్తితో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వాటర్వర్క్స్ విభాగం జీఎం కుమార్ గౌరవ్, మురుగునీటి వ్యవస్థ నిర్వహిస్తున్న సంస్థ ప్రతినిధులు కూడా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రోడ్డు వరుసగా మూడుసార్లు కుంగడం అధికారుల, కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపించారు.
భూగర్భ పైప్లైన్ లీకేజీ కారణంగానే రోడ్డు కుంగిపోయిందని స్థానికులు తెలిపారు. కేవలం గుంతలను పూడ్చడం కాకుండా మొత్తం రహదారి భాగాన్ని తిరిగి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. పేవన్ బన్సాల్ అనే స్థానికుడు మాట్లాడుతూ.. రోడ్డు శాశ్వత పరిష్కారం కోసం నాణ్యతతో పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ రహదారిపై ప్రతిరోజూ 25 నుంచి 30 వరకు పాఠశాల, కళాశాల బస్సులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తాయని స్థానికులు తెలిపారు. అయితే రోడ్డు కుంగిన సమయంలో ఆ మార్గంలో పాదచారులు, వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
గతంలో ఇదే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తు చేశారు. రహదారి నిర్వహణలో మున్సిపల్ కార్పొరేషన్, నీటిపారుదల శాఖ, సంబంధిత సంస్థల పనితీరుపై నితిన్ కోహ్లీ విమర్శలు చేశారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news