భారత్లో కృత్రిమ మేధస్సు, డేటా కేంద్రాల విస్తరణ వేగంగా జరుగుతున్నప్పటికీ.. ఈ అభివృద్ధి కొత్త సవాళ్లను తెరపైకి తెస్తోంది. ముఖ్యంగా నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతోందని ప్రపంచ వనరుల సంస్థ విశ్లేషణ వెల్లడించింది. దేశంలోని ప్రస్తుతం ఉన్న, భవిష్యత్తులో ఏర్పడనున్న డేటా కేంద్రాల్లో సగానికి పైగా అధిక లేదా అత్యధిక నీటి ఒత్తిడి ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపింది.
భారత్లో డేటా కేంద్రాల విస్తరణ కొన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే దేశంలోని సుమారు 75 శాతం క్రియాశీల, రాబోయే డేటా కేంద్రాలు ఉన్నాయని అంచనా. వీటిలో అనేక ప్రాంతాలు ఇప్పటికే పట్టణ నీటి వనరులపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఏఐ ఆధారిత కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతున్న కొద్దీ డేటా కేంద్రాల్లో శీతలీకరణ అవసరం కూడా భారీగా పెరుగుతోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం.. 2025లో భారత్లో డేటా కేంద్రాల నీటి వినియోగం సుమారు 150 బిలియన్ లీటర్లుగా ఉండగా, 2030 నాటికి ఇది దాదాపు 358 బిలియన్ లీటర్లకు చేరుకునే అవకాశం ఉంది.
ఈ అంశంపై పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. ఏఐ డేటా కేంద్రాలకు ప్రత్యేకంగా పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే భవన నిర్మాణం, పట్టణ అభివృద్ధి వంటి నిర్దిష్ట విభాగాల కిందకు వచ్చే భారీ డేటా కేంద్రాలకు మాత్రం ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని తెలిపింది.
ఇలాంటి ప్రాజెక్టుల పరిశీలనలో నీటి లభ్యత, ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులు, నీటి సమతుల్య నివేదికలు, మురుగునీటి ఉత్పత్తి, పునర్వినియోగం వంటి అంశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. డేటా కేంద్రాల నీటి వినియోగం, వ్యర్థ జలాల విడుదలను నీటి కాలుష్య నియంత్రణ చట్టం కింద పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
భారత్లో డేటా కేంద్రాల సామర్థ్యం కూడా వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ప్రకారం.. 2025 నాటికి దేశంలోని డేటా కేంద్రాల సామర్థ్యం 1,500 మెగావాట్లను దాటింది. 2020లో ఇది కేవలం 375 మెగావాట్లుగా ఉండటం గమనార్హం.
విశాఖపట్నంలో ప్రతిపాదించిన గూగుల్ భారీ డేటా కేంద్రం నేపథ్యంలో నీటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి ప్రస్తుతం రోజుకు సుమారు 410 మిలియన్ లీటర్ల నీరు అందుతుండగా, అవసరం 480 మిలియన్ లీటర్లుగా ఉందని అంచనా. అంటే రోజుకు దాదాపు 70 మిలియన్ లీటర్ల లోటు ఉంది. ఈ నేపథ్యంలో భారీ డేటా కేంద్రానికి అవసరమయ్యే నీటి వనరులపై చర్చ జరుగుతోంది.
డేటా కేంద్రాల్లో సర్వర్లను చల్లబరచడానికి ప్రధానంగా ఆవిరి ఆధారిత శీతలీకరణ పద్ధతులు ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో వినియోగించే నీటిలో ఎక్కువ భాగం ఆవిరైపోతుందని, తిరిగి స్థానిక నీటి వ్యవస్థలోకి చేరదని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే నీటి వినియోగాన్ని తగ్గించేందుకు కొత్త సాంకేతికతలు అభివృద్ధి చెందుతున్నాయి. ద్రవ శీతలీకరణ, ఇమ్మర్షన్ కూలింగ్, నీరు లేని శీతలీకరణ విధానాలు, శుద్ధి చేసిన నీటి వినియోగం, వ్యర్థ ఉష్ణ పునర్వినియోగం వంటి పద్ధతులు పరిష్కార మార్గాలుగా భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా శుద్ధి చేసిన నీటిని శీతలీకరణ అవసరాలకు వినియోగించాలని సూచిస్తోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మార్గదర్శకాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులు, సమర్థవంతమైన శీతలీకరణ వ్యవస్థలు, నీటి పొదుపు చర్యలను ప్రోత్సహిస్తున్నారు.
ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, నోయిడా వంటి సాంకేతిక కేంద్రాల్లో డేటా కేంద్రాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఏఐ అభివృద్ధి, నీటి భద్రత మధ్య సమతుల్యత కీలకంగా మారనుంది. దేశం ఏఐ మౌలిక వసతులను వేగంగా నిర్మిస్తున్నప్పటికీ.. వాటికి అవసరమైన నీటి వనరులను ఎలా సమకూర్చుకోవాలన్నది విధాన నిర్ణేతల ముందున్న ప్రధాన సవాలుగా మారుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news