రాజమహేంద్రవరంలోని జేఎన్ రోడ్డులో ఉన్న ఆంధ్రకేసరి (ఏకేసి) కళాశాల జంక్షన్ వద్ద ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన "మీ భద్రత – మా బాధ్యత" కార్యక్రమంలో విద్యార్థులకు క్రమశిక్షణ, మహిళల భద్రత, చట్టాలపై అవగాహన, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై పోలీసులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చూపిన ధైర్యం, దేశభక్తి, నిజాయితీ, ప్రజాసేవ ప్రతి విద్యార్థికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. విద్యార్థి దశలో రాజకీయాలకు దూరంగా ఉండి చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. మంచి స్నేహితులను ఎంచుకోవడంతో పాటు గంజాయి, మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, క్రమశిక్షణే వ్యక్తిగత, సామాజిక, జాతీయ అభివృద్ధికి మూలమని పేర్కొన్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవా తత్వాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, సేవాభావం పెంపొందించుకుంటేనే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని తెలిపారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికతపై యువతకు అవగాహన ఉండాలని సూచించారు.
ఈగల్ టీం, పోలీసు అధికారులు విద్యార్థులకు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, చట్టాలపై అవగాహన కల్పించారు. నగరంలో ఇప్పటివరకు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడిస్తూ, మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రకేసరి యువజన సమితి సభ్యులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు, కూటమి నాయకులు పాల్గొని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులకు ఘనంగా నివాళులర్పించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news