మెగా డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిల్లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రజాహిత వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. పిల్ అనేది ఎంతో విలువైన న్యాయపరమైన సాధనమని, దాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంలో నష్టపోయామని భావించిన అభ్యర్థులు మొదటి నుంచే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. రిజర్వేషన్ కోటా పెంపు, క్రీడల కోటా మార్పులపై అభ్యంతరాలు ఉంటే అప్పుడే అభ్యర్థులు కోర్టును ఆశ్రయించేవారని గుర్తు చేసింది.
క్రీడల కోటా కారణంగా నష్టం జరిగిందని భావించిన అభ్యర్థులు ఎవరూ నేరుగా కోర్టుకు రాలేదని ధర్మాసనం పేర్కొంది. బాధితులను ప్రభుత్వం భయపెడుతోందన్న పిటిషనర్ వాదనలను కూడా పరిశీలించిన కోర్టు, ప్రభుత్వం భయపెడితే 335 రిట్ పిటిషన్లు హైకోర్టులో ఎలా దాఖలయ్యాయని ప్రశ్నించింది. అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే క్రీడల రిజర్వేషన్ కోటాను నిర్ణయించినట్లు ధర్మాసనం పేర్కొంది. కేంద్ర విధానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా అలాంటి నిర్ణయం తీసుకునేది కాదని వ్యాఖ్యానించింది. తన వాదనలకు అనుకూలంగా బలమైన ఆధారాలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచలేదని అభిప్రాయపడింది.
అక్రమ మార్గంలో ఉపాధ్యాయ పోస్టులు పొందారని ఆరోపిస్తున్న వ్యక్తులను పిటిషన్లో ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పిల్ విచారణార్హతపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం, పిటిషన్ కొనసాగించాలా లేదా ఉపసంహరించుకోవాలా అనే విషయంపై పిటిషనర్‌తో చర్చించి తెలియజేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది.
మరోవైపు, అదనపు వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కోరడంతో విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ మెడమల్లి బాలాజీతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయని, క్రీడల కోటాను చివరి దశలో మార్చారని ఆరోపించారు. దశాబ్దాలుగా ఉన్న రెండు శాతం క్రీడల కోటాను మూడు శాతానికి పెంచారని, అర్హత నిబంధనల్లో మార్పులు చేశారని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష నిర్వహణ ఒకే సంస్థకు అప్పగించడం వల్ల గోప్యతపై అనుమానాలు ఉన్నాయని వాదించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. డీఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించామని, ఎంపిక వివరాలు మొత్తం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసిందని వివరించారు. హైకోర్టులో డీఎస్సీకి సంబంధించి 335 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిలో క్రీడల కోటాకు సంబంధించినవి కూడా ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వ వాదనలు, పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పిల్ విచారణార్హత అంశంపై స్పష్టత కోరింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. దీంతో మెగా డీఎస్సీ-2025పై దాఖలైన ఈ పిల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news