ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. యలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా పిడుగుల ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా వర్ష సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలతో పాటు ఉరుములు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. ఏలూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించారు.
పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news