జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. బనగానపల్లె పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ జి. మద్దయ్య యాదవ్, బనగానపల్లె నియోజకవర్గ అధ్యక్షులు గుండం సర్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. వార్తా సేకరణలో భాగంగా ప్రజలకు సమాచారం అందించే జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు.
జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మీడియా రంగ సమస్యల పరిష్కారానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులందరికీ పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులను అసంఘటిత కార్మికులుగా గుర్తించి కార్మిక బీమా సదుపాయం వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి, జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులు కోరారు. జర్నలిస్టులపై దాడుల నివారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని, సమస్యల పరిష్కారానికి శాశ్వత వ్యవస్థను తీసుకురావాలని సూచించారు.
మీడియా అకాడమీ పాలనకు సంబంధించిన గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, వృత్తిపరమైన అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ బనగానపల్లె నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు సూర్య రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు ఆంధ్ర అక్షర రామచంద్రారెడ్డి, సూర్య నరసింహారెడ్డి, టీవీ9 జవహార్, ట్రెజరర్ అవుకు శ్రీనివాసులు, మండల స్థాయి నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడుతామని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
Fetching videos...
Fetching latest news...
No trending news