ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డి చేస్తున్న విమర్శలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు బీద రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులకు అన్యాయం జరిగిందని గుండు చేయించుకుని నిరసన వ్యక్తం చేయడం రాజకీయ నాటకమని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు నిజంగా అన్యాయం జరిగిందని భావించి నిరసన తెలపాలనుకుంటే అది కూటమి ప్రభుత్వ హయాంలో కాకుండా వైసీపీ పాలనలో చేయాల్సిందని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు జీతాల చెల్లింపులు ఆలస్యం చేయడం, బకాయిలు పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదురైనా వెంకట్రామిరెడ్డి స్పందించలేదని బీద రవిచంద్ర ఆరోపించారు. ఉద్యోగ సంఘ నేతగా ఉన్నప్పటికీ అప్పట్లో ఉద్యోగుల హక్కుల కోసం పోరాడలేదని, ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తోందని బీద రవిచంద్ర తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన బకాయిలను చెల్లించడంతో పాటు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 10,715 మంది సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పించడం ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని వివరించారు.
ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుండగా వాటిని రాజకీయ కోణంలో విమర్శించడం సరికాదని బీద రవిచంద్ర అభిప్రాయపడ్డారు. వైసీపీ పాలనలో ఉద్యోగుల సమస్యలపై మౌనం పాటించిన వెంకట్రామిరెడ్డికి ప్రస్తుతం ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని బీద రవిచంద్ర స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news