బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో 12 ఏళ్ల ఆరో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతికి సంబంధించిన ఘటన కలకలం రేపుతోంది. యలహంక సమీపంలోని కడయరప్పనహళ్లి గ్రామంలో ఉన్న స్టెర్లింగ్ ఇంగ్లీష్ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పాఠశాల శారీరక విద్య ఉపాధ్యాయుడిపై హత్య కేసు నమోదు చేశారు.
మృతుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం, తన కుమారుడు జాగింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడని, వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పాఠశాల యాజమాన్యం సమాచారం ఇచ్చిందని తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకునే సమయానికే బాలుడు మృతి చెందినట్లు చెప్పారు. పాఠశాల చెబుతున్న కారణాలను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
మరో విద్యార్థి తెలిపిన సమాచారం ఆధారంగా మృతుడి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. పీఈ టీచర్ నారాయణ్ తన కుమారుడిపై ఇనుప రాడ్‌తో దాడి చేశారని, మెడను వంచడంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు పోలీసులు భారతీయ న్యాయ సంహిత కింద ఉపాధ్యాయుడిపై హత్య కేసు నమోదు చేశారు.
విద్యార్థి మృతి విషయం బయటకు రావడంతో పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట నిరసనకు దిగారు. బాలుడి మృతికి న్యాయం చేయాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పాఠశాల యాజమాన్యం మాత్రం విద్యార్థి పరుగు తీస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని, అతడికి గతంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. అయితే పోలీసులు ఈ వాదనలను కూడా పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను సేకరించిన పోలీసులు, పీఈ టీచర్‌కు నోటీసులు జారీ చేశారు.
విద్యార్థి మృతికి అసలు కారణం తెలుసుకునేందుకు పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. వైద్య నివేదిక, సీసీటీవీ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news