80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన వేడుకల్లో వైద్య రంగంలో విశేష సేవలు అందించిన అన్నాచెల్లెళ్లు డా. టి. జగన్ మోహనరావు, డా. టి. హేమాక్షిలకు అవార్డులు లభించాయి. జిల్లా ఎన్సీడీ అధికారిగా డా. జగన్ మోహనరావు, జిల్లా ఆయుష్ అధికారిగా డా. హేమాక్షి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా, జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి సమక్షంలో ఈ పురస్కారాలను అందుకున్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో చూపిన ప్రతిభ, అంకితభావాన్ని గుర్తించిన అధికారులు వీరిని సత్కరించారు. ఒకే వేదికపై అన్నాచెల్లెళ్లకు వారి సేవలకు గుర్తింపు లభించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు, వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ డా. జగన్ మోహనరావు, డా. హేమాక్షిలను అభినందించారు. ప్రజారోగ్య రంగంలో వారు అందిస్తున్న సేవలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
గతంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాల్లోనూ డా. జగన్ మోహనరావు, డా. హేమాక్షి కీలకంగా వ్యవహరించారు. ఆయా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజల్లో ఆరోగ్యం, యోగా, జీవనశైలి పట్ల అవగాహన పెంపొందించేందుకు కృషి చేశారు. వారి సేవలను గుర్తించిన జిల్లా కలెక్టర్ గతంలోనూ ప్రశంసా పత్రాలు అందజేశారు. తాజాగా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మరోసారి వారి సేవలకు గుర్తింపు లభించడం విశేషంగా మారింది.
జిల్లా కలెక్టర్ వినూత్నంగా చేపట్టిన ‘నాటువైద్యానికో నమస్కారం’ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు డా. జగన్ మోహనరావు లఘునాటిక ద్వారా ప్రచారం నిర్వహించారు. సంప్రదాయ వైద్య విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషిని గుర్తించారు. ఇదే వేదికపై డా. జగన్కు మరో అవార్డును అందజేశారు. దీంతో ఒకే కార్యక్రమంలో ఆయనకు వైద్య సేవలతో పాటు అవగాహన కార్యక్రమంలో చూపిన ప్రతిభకు కూడా గుర్తింపు దక్కింది.
Fetching videos...
Fetching latest news...
No trending news