విశాఖపట్నం జిల్లా భోగాపురంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సభకు హాజరయ్యే వారి కోసం ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,800 బస్సులను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను సభా ప్రాంగణానికి తరలిస్తున్నారు. ఉదయం నుంచే బస్సులు వరుసగా భోగాపురం వైపు చేరుకుంటుండగా, సభా ప్రాంగణం సందడిగా మారింది. సభకు విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, విశ్రాంతి ప్రాంతాలు, పారిశుద్ధ్య ఏర్పాట్లు కూడా కల్పించారు.
భద్రతా పరంగా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భోగాపురం విమానాశ్రయాన్ని 13 ప్రత్యేక విభాగాలుగా విభజించి, వాటిని మరోసారి 89 సెక్టార్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్కు 80 నుంచి 100 మంది వరకు పోలీసు సిబ్బందిని నియమించి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను తరలించి బందోబస్తును మరింత బలోపేతం చేశారు. ఐపీఎస్ అధికారులు, డీజీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సభా ప్రాంగణం, విమానాశ్రయ జోన్, పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారులు, ప్రవేశ మార్గాల వద్ద ప్రత్యేక భద్రతా బృందాలను మోహరించారు. ఔటర్ పెరిఫెరల్ ప్రాంతాల్లో ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు మోహరించి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా పెంచాయి. మెటల్ డిటెక్టర్లతో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే అనుమతిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు సభా ప్రాంగణం, విమానాశ్రయం, వాహన పార్కింగ్ ప్రాంతాలు, వేదిక పరిసరాలను పలుమార్లు పరిశీలించి భద్రతను నిర్ధారించాయి.
భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణకు కూడా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ ప్రాంతాలను ముందుగానే గుర్తించి వాహనాలను అక్కడికే మళ్లిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ప్రాంతంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రజలు సురక్షితంగా సభలో పాల్గొని తిరిగి వెళ్లేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పోలీసులు, భద్రతా సిబ్బంది, సహాయక బృందాలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తుండగా, సభ విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news