బిహార్ పంచాయతీరాజ్ మంత్రి దీపక్ ప్రకాశ్ పదవిపై కొనసాగుతున్న వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కీలక సమాచారం అందించింది. రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి చెందిన దీపక్ ప్రకాశ్‌ను శాసన మండలి సభ్యుడిగా నామినేట్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మంత్రి పదవిలో కొనసాగేందుకు ఆయనకు ఎలాంటి రాజ్యాంగ అడ్డంకి లేదని స్పష్టం చేసింది.
ఈ అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బిహార్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. దీపక్ ప్రకాశ్ ఇప్పటికే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారని ధర్మాసనానికి తెలిపారు.
మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యుడిగా మారలేదనే కారణంతో దీపక్ ప్రకాశ్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ కొనసాగిస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసును ముగించాలని బిహార్ ప్రభుత్వం కోరింది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది దీనిని వ్యతిరేకించారు. రాజ్యాంగ ఉల్లంఘన ఇప్పటికే జరిగిందని, ఎమ్మెల్సీగా నియామక ప్రక్రియ చట్టబద్ధతపై కూడా ప్రశ్నలు ఉన్నాయని వాదించారు.
దీపక్ ప్రకాశ్ తొలుత 2025 నవంబర్ 20న మంత్రిగా నియమితులయ్యారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం ఆరు నెలల్లోగా శాసనసభ సభ్యుడు కాకపోతే మంత్రి పదవి ముగిసినట్లేనని పిటిషనర్ తరఫు న్యాయవాది సుదీప్ చంద్ర వాదించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఎస్.ఆర్. చౌదరి వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు.
అయితే ప్రభుత్వం మాత్రం దీపక్ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడంతో రాజ్యాంగ నిబంధనలు పూర్తయ్యాయని వాదిస్తోంది. మంత్రి పదవికి కొత్తగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం లేదని పిటిషనర్ వాదించగా, దీనిపై పూర్తి విచారణ అవసరమని కోర్టు భావించింది.
సంబంధిత నియామక నోటిఫికేషన్‌ను సమర్పించాలని బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఈ కేసు ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4), మంత్రుల పదవీకాలం, ఆరు నెలల నిబంధనలపై కీలక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news