విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అధికారం అనేది తమకు అలంకారం కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు అందజేసే ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి, సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సమస్య వెంటనే పరిష్కరించలేని పరిస్థితుల్లో కూడా ఎప్పుడు పరిష్కారం అవుతుందనే సమాచారాన్ని ప్రజలకు అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.
ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ వల్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని బొండా ఉమా తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసే అవకాశం కలుగుతోందని, అందిన ప్రతి అర్జీపై స్పందన ఉంటుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తల్లికి వందనం పథకం కింద లబ్ధి అందని పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వారి నుంచి ఫిర్యాదు దరఖాస్తులను స్వీకరించి, ప్రతి అర్జీకి ప్రత్యేక సంఖ్య కేటాయించి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు బొండా ఉమా తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మ్యాపింగ్ విధానం కారణంగా కొన్ని కుటుంబాలు అనర్హుల జాబితాలో కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. ఇల్లు, విద్యుత్ కనెక్షన్, ఆదాయపు పన్ను, నాలుగు చక్రాల వాహనం వంటి వివరాల ఆధారంగా కొందరికి పథకం అందలేదని, మరికొందరికి తక్కువ మొత్తం జమైందని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో పాటు పార్టీ శ్రేణులు ప్రజల ఇళ్లకు వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారని చెప్పారు.
ప్రజల నుంచి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని గద్దె అనురాధ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలపై లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో ఇంటి స్థలాల సమస్యలను కొందరు తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారానే మంచి పాలన సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, నియోజకవర్గ స్థాయి నేతలు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news