వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ కూటమిగా ఉన్న బ్రిక్స్.. కేవలం ఆర్థిక చర్చల వేదికకే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం, కాలుష్యం వంటి కీలక ప్రపంచ సమస్యలపై ఉమ్మడి విధానాలను రూపొందించే ప్రభావవంతమైన వేదికగా మారుతోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్ తెలిపారు. దిల్లీలోని భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ పర్యావరణ కార్యాచరణ బృందం, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి సంప్రదింపుల బృందం సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత విస్తరిస్తోందని పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యం, వనరుల సమర్థ వినియోగం, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ పాలన వంటి అంశాల్లో భాగస్వామ్యం బలపడిందని తెలిపారు.
భారత్ నాయకత్వంలో జరుగుతున్న బ్రిక్స్ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత మార్గనిర్దేశం చేస్తోందని తన్మయ్ కుమార్ వివరించారు. మానవాళికి ప్రాధాన్యం ఇచ్చే విధానంతో ప్రపంచ సహకారం కొనసాగాలని భారత్ కోరుకుంటోందన్నారు. స్థిరత్వం, నూతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతను బలోపేతం చేయడమే భారత అధ్యక్షత ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధి లక్ష్యాలను సమన్వయం చేసే విధానాలను భారత్ ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.
భారత్ అధ్యక్షతలో పర్యావరణ కార్యాచరణ బృందం, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి సంప్రదింపుల బృందం కలిసి నాలుగు ప్రధాన అంశాలపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయి. సుస్థిర జీవన విధానాలను ప్రోత్సహించడం, అడవుల పెంపకం, అడవి మంటల నిర్వహణ, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. బ్రిక్స్ దేశాలు ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, వాటిని విడివిడిగా కాకుండా సమగ్ర విధానంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని తన్మయ్ కుమార్ తెలిపారు.
వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యం, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ, వనరుల సమర్థ వినియోగం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని ఆయన వివరించారు. అందువల్ల సమగ్ర, సమన్వయ విధానాలతోనే ఈ సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని పేర్కొన్నారు. భారత్ అధ్యక్షత ప్రారంభమైనప్పటి నుంచి బ్రిక్స్ సభ్యదేశాల మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇరవై ఒక వర్చువల్ అంశాల వారీ సమావేశాలు, పది ద్వైపాక్షిక సంప్రదింపులు, రెండు అంశాల వారీ చర్చలు, రెండు సాంకేతిక సదస్సులు నిర్వహించినట్లు వివరించారు.
ఈ సమావేశాల్లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధిపై ఉమ్మడి కార్యాచరణకు సభ్యదేశాలు మద్దతు తెలిపాయి. భారత్ అధ్యక్షతలో జరిగిన చర్చలను సభ్యదేశాల ప్రతినిధులు అభినందించారు. పరస్పర గౌరవం, విశ్వాసం, ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునే వాతావరణంలో చర్చలు సాగాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సహకార స్ఫూర్తితో బ్రిక్స్ దేశాలు పర్యావరణ సమస్యలపై కలిసి పనిచేస్తాయని తన్మయ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news