ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనుల రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర బొగ్గుశాఖ నిర్వహించిన ఈ-వేలంలో ఈ రెండు బొగ్గు గనులను రిలయన్స్ సంస్థ దక్కించుకుంది. సుమారు రూ.లక్ష కోట్ల భారీ పెట్టుబడితో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏలూరు జిల్లాకు పారిశ్రామికంగా కొత్త అవకాశాలు రానున్నాయి.
రిలయన్స్ సంస్థ ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ప్రాజెక్టు వివరాలను, కార్యాచరణ ప్రణాళికను వివరించారు. గనుల అభివృద్ధి, సాంకేతిక విధానాలు, పెట్టుబడులపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
చింతలపూడి బ్లాక్ సుమారు 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండగా, ఇందులో జీ-12 రకం బొగ్గు నిల్వలు 904.94 మిలియన్ టన్నుల వరకు ఉన్నట్లు అంచనా. సమీపంలోని రేచెర్ల బ్లాక్ 2,225 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో జీ-13 రకం బొగ్గు నిల్వలు 2,225.67 మిలియన్ టన్నుల మేర ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
ఈ రెండు గనుల్లో కలిపి మొత్తం 3,130.61 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బొగ్గు నిక్షేపాలు భూమి ఉపరితలం నుంచి సుమారు 600 మీటర్లు లేదా అంతకంటే లోతులో ఉండటంతో సాధారణ తవ్వకాల ద్వారా వెలికితీత వ్యయం అధికంగా ఉండనుంది. దీంతో ప్రత్యామ్నాయంగా భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు.
చింతలపూడి, రేచెర్లలో ఏర్పాటు చేయనున్న అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు దేశంలోనే తొలి భారీ ప్రాజెక్టుగా నిలవనుంది. ఈ సాంకేతిక విధానం ద్వారా భూమి లోపల ఉన్న బొగ్గును గ్యాస్ రూపంలోకి మార్చి వినియోగించనున్నారు. దీనివల్ల లోతైన ప్రాంతాల్లో ఉన్న బొగ్గు నిల్వలను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలకు అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. గనుల అభివృద్ధితో పాటు రవాణా, సేవా రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
2029 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతికతతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ఏలూరు జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మలుపుగా మారనుంది. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news