భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన ఆయన, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రాంత అభివృద్ధికి కీలక మలుపుగా మారనుందని తెలిపారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాభివందనం చేశారు. అభివృద్ధి కోసం రైతులు చేసిన త్యాగం ఎంతో గొప్పదని కొనియాడారు. వారి సహకారం వల్లే ఇలాంటి భారీ ప్రాజెక్టు సాకారం అయిందని పేర్కొన్నారు. రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువబోమని అన్నారు.
భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక రవాణా ప్రాజెక్టు మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రముఖ సంస్థలు రానున్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. గూగుల్, స్టీల్ కంపెనీతో పాటు అనేక సంస్థలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. దీనివల్ల యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమల అభివృద్ధి కలిసి ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చనున్నాయని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పెట్టుబడులకు అనుకూలమైన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news