పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బిహార్ జిల్లాలో ముగ్గురిని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దినహటా ప్రాంతంలోని సాహెబ్‌గంజ్‌లో శుక్రవారం రాత్రి ఈ అరెస్టులు జరిగాయి. నిందితులను రషీదుల్ హక్, నూర్ నసీరుద్దీన్ అలీ, షఫీకుల్ ఇస్లాంగా గుర్తించారు. స్వతంత్ర దినోత్సవానికి ముందు వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో హాజరుపరిచి 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.
దర్యాప్తు అధికారుల ప్రకారం, నిందితులు భారత్‌లో రహస్యంగా పనిచేస్తున్న ఐఎస్ఐ ఏజెంట్లుగా వ్యవహరించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్ మీదుగా పాకిస్థాన్‌కు భారతీయ మొబైల్ సిమ్ కార్డులను అక్రమంగా తరలించినట్లు వారిపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా నకిలీ కరెన్సీ నోట్ల తయారీలోనూ వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అరెస్టులు పశ్చిమ బెంగాల్లో ఉగ్రవాద సంబంధాలున్నాయనే అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో చోటుచేసుకున్నాయి.
ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్, షహజాద్ భట్టి గ్యాంగ్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న హమీమ్ మండల్‌ను బర్ధమాన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడి ప్రియురాలు, సహాయకురాలిగా భావిస్తున్న అర్పితా సర్కార్‌ను జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌లో, మరో సహచరుడు ఆదిత్య సింగ్ అలియాస్ రాజును హౌరాలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో నలుగురిని అనుమానిత ఉగ్ర సంబంధాల కేసుల్లో అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో పాకిస్థాన్ జాతీయుడైన రానా రౌఫ్ అలియాస్ వహాబ్ ఆలం కూడా ఉన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రాలో అతడిని గూఢచర్యం అనుమానంతో అరెస్ట్ చేశారు. 2012లో నేపాల్ మీదుగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన రౌఫ్ నకిలీ ఓటరు, ఆధార్ కార్డులు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. కోల్‌కతాలోని కీలక ప్రాంతాలతో పాటు సున్నిత ప్రదేశాలపై నిఘా పెట్టినట్లు అనుమానిస్తున్నారు. రౌఫ్‌కు చెందిన నోట్‌బుక్ దర్యాప్తులో కీలక ఆధారంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. అతడిని విచారించడంతో ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మరో ఐదుగురి వివరాలు బయటపడ్డాయని ప్రత్యేక దర్యాప్తు బృందం వర్గాలు తెలిపాయి. అయితే కూచ్బిహార్లో తాజా అరెస్టులకు రౌఫ్‌తో ఉన్న సంబంధాలే కారణమా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Fetching videos...
Fetching latest news...
No trending news