రైలు ప్రయాణికుల హక్కులను మరోసారి స్పష్టం చేస్తూ ఢిల్లీ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కీలక తీర్పు వెలువరించింది. ఆర్ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) టికెట్‌తో ప్రయాణించిన ఇద్దరు అపరిచిత ప్రయాణికులకు ఒకే దుప్పటి, ఒకే దిండు ఇవ్వడం సేవల్లో లోపంగా పరిగణించిన కమిషన్, భారతీయ రైల్వేలు రూ.25,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో రూ.20,000ను మానసిక వేదన, శారీరక అసౌకర్యానికి పరిహారంగా, మరో రూ.5,000ను న్యాయపరమైన ఖర్చుల కింద చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే 60 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించకపోతే వార్షిక 7 శాతం వడ్డీతో చెల్లించాలని కూడా కమిషన్ స్పష్టం చేసింది.
ఈ కేసు 2022లో జరిగిన ఒక రైలు ప్రయాణానికి సంబంధించినది. ప్రయాగ్‌రాజ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించిన ఓ ఆర్ఏసీ ప్రయాణికుడు తనకు కేటాయించిన సీటును మరో అపరిచిత ప్రయాణికుడితో పంచుకోవాల్సి వచ్చిందని ఫిర్యాదు చేశాడు. అయితే ప్రయాణ సమయంలో ఇద్దరికీ కలిపి కేవలం ఒకే దుప్పటి, ఒకే దిండు, రెండు బెడ్షీట్లు మాత్రమే అందించారని ఆయన ఆరోపించాడు. రాత్రి ప్రయాణంలో అపరిచిత వ్యక్తితో ఒకే దుప్పటిని పంచుకోవడం తీవ్ర అసౌకర్యానికి గురిచేసిందని, ఇది ప్రయాణికుల గౌరవం, ఆరోగ్యానికి కూడా భంగం కలిగించే పరిస్థితి అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు
ప్రయాణికుడు అదనపు దుప్పటి, దిండు ఇవ్వాలని రైల్వే సిబ్బందిని కోరగా, "ఒక సీటుకు ఒకే దుప్పటి, ఒకే దిండు ఇవ్వడం నిబంధన" అని సమాధానం ఇచ్చినట్లు ఫిర్యాదులో వివరించాడు. అనంతరం ఆయన సామాజిక మాధ్యమం ద్వారా కూడా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు పంపిన తర్వాత అదనపు దుప్పటి బదులుగా ఒక టవల్ మాత్రమే ఇచ్చారని, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. టికెట్ తనిఖీ అధికారిని (టీటీఈ) సంప్రదించి ఫిర్యాదు పుస్తకం కోరినా అది కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. తరువాత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు సమాచార హక్కు చట్టం కింద కూడా వివరాలు కోరినప్పటికీ సకాలంలో స్పందన రాలేదని ఆయన వాదించారు.
ఈ వ్యవహారంలో ఉత్తర రైల్వే తమ వాదనలు వినిపిస్తూ, అవసరాన్ని బట్టి అదనపు దుప్పటి అందించే అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాగే లినెన్ సరఫరా బాధ్యత కాంట్రాక్టు సంస్థదని తెలిపింది. అయితే కమిషన్ ఎదుట రైల్వేలు ప్రత్యేక బెడ్‌రోల్ అందించారని నిరూపించే ఆధారాలు సమర్పించలేకపోయాయి. ఇదే సమయంలో అంతర్గత విచారణలో లినెన్ సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై రూ.1,000 జరిమానా విధించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ చర్య గురించి ప్రయాణికుడికి సమాచారం ఇవ్వకపోవడం, అతనికి ఎలాంటి పరిహారం అందించకపోవడం కూడా కమిషన్ దృష్టికి వచ్చింది.
కమిషన్ తన తీర్పులో 2009లో రైల్వే బోర్డు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావించింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఏసీ తరగతుల్లో ఆర్ఏసీ ప్రయాణికుల నుంచి కూడా బెడ్‌రోల్ ఛార్జీలు వసూలు చేస్తారు కాబట్టి, వారికి ప్రత్యేకంగా దుప్పటి, బెడ్‌షీట్ వంటి సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత రైల్వేలపై ఉంటుందని పేర్కొంది. ఈ నిబంధనలను పాటించకపోవడం సేవల్లో లోపంగా పరిగణించాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది.
Fetching videos...
Fetching latest news...
No trending news