దేశ రాజధాని ఢిల్లీలో మహిళా పోలీసుల ఆరోగ్యం, గౌరవం, ప్రాథమిక సౌకర్యాల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందికి ప్రత్యేక టాయిలెట్లు, శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహిళా పోలీసులకు గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ అంశంపై కోర్టు స్పందించింది. దేశ రాజధానిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అనే విషయంపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
ఈ సర్వేను ఆరు వారాల్లో పూర్తి చేయాలని కోర్టు గడువు విధించింది. అలాగే ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలపై నివేదిక రూపంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది.
మహిళా పోలీసుల ప్రాథమిక సౌకర్యాల లోపం విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. ‘జస్టిస్ ఫర్ రైట్స్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ తరఫున మహిళా విభాగం ప్రతినిధి ముస్కాన్ సింగ్ బంకురా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
పిటిషన్లో గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో వివిధ జిల్లాల నుంచి ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలను ప్రస్తావించారు. ఢిల్లీ పోలీస్ పరిధిలోని అనేక పోలీస్ స్టేషన్లలో మహిళా సిబ్బందికి అవసరమైన పరిశుభ్రత సదుపాయాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషీన్లు, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పరికరాలు, వాటి కోసం ప్రత్యేక బడ్జెట్ వంటి అంశాల్లో తీవ్ర కొరత ఉందని పిటిషన్లో వివరించారు.
విధి నిర్వహణలో మహిళా పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, వారికి ప్రాథమిక ఆరోగ్య, పరిశుభ్రత సదుపాయాలు అందకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనగా పిటిషనర్లు వాదించారు. భారత రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణాలు కల్పిస్తున్న సమానత్వం, గౌరవం, ఆరోగ్యం, గోప్యత హక్కులకు ఇది విరుద్ధమని తెలిపారు.
మహిళలకు కార్యాలయాల్లో అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం గౌరవప్రదమైన జీవనంలో భాగమని హైకోర్టు పేర్కొంది. ముఖ్యంగా పోలీస్ శాఖ వంటి కఠినమైన విధులు నిర్వహించే రంగాల్లో మహిళా సిబ్బందికి తగిన వసతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.
పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక టాయిలెట్లు, శానిటరీ సదుపాయాలు లేకపోవడం వల్ల మహిళా సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను కోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళల ఆరోగ్యం, వ్యక్తిగత గౌరవం, గోప్యతను రక్షించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలతో రాజధానిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసులకు మెరుగైన పరిశుభ్రత సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ప్రాథమిక వసతుల ప్రాముఖ్యతపై కూడా ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news