గుంటూరులోని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) వెల్నెస్ కేంద్రానికి కొత్త చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ దాసరి రమేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంపాలెంలో ఉన్న సీజీహెచ్ఎస్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రమేష్‌ను సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పుష్పగుచ్ఛాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో పెన్షనర్లు ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు సమస్యలను కొత్త సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని డాక్టర్ దాసరి రమేష్ తెలిపారు. ఆసుపత్రుల యాజమాన్యాలతో సమన్వయం పెంచి రోగుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నాణ్యమైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కొండా నాగార్జున మాట్లాడుతూ, వైద్యుల కొరత ఉన్నప్పటికీ ప్రతిరోజూ వందకు పైగా ఓపీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పెన్షనర్లకు ప్రాధాన్యత ఇచ్చి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు టి. వివేకానంద మాట్లాడుతూ, వైద్యులు నిబద్ధతతో సేవలు అందించి రోగులకు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు.
లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు గుమ్మడి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ, సీజీహెచ్ఎస్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు పొందడం పెన్షనర్ల హక్కు అని పేర్కొన్నారు. శస్త్రచికిత్సల పేరుతో అధిక రుసుములు వసూలు చేస్తున్న ఎంపానెల్డ్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పలువురు పెన్షనర్లు, వైద్య సిబ్బంది, నర్సింగ్ అధికారులు, ఫార్మాసిస్టులు, ఉద్యోగులు పాల్గొని ఆరోగ్య సేవల మెరుగుదలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news