జూలై 17న నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో నిర్వహించనున్న ‘క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్’ విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ వివిధ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల పంపిణీ చేయనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, తాగునీటి సదుపాయం, ఆహార పంపిణీ, వైద్య సేవలు, అత్యవసర సహాయక చర్యలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
రుణాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి శాఖకు బాధ్యతలు కేటాయించి, ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news