గుజరాత్‌లోని బనాస్కాంతా జిల్లాలో ఎలుగుబంటి దాడులు కలకలం రేపాయి. పలన్‌పూర్ ప్రాంతంలోని రెండు గ్రామాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. అడవి ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి గ్రామస్థులపై దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అంబాజీ వన్యప్రాణి కారిడార్ పరిసర అడవుల నుంచి ఎలుగుబంటి బయటకు వచ్చి గ్రామాల్లోకి ప్రవేశించినట్లు అధికారులు భావిస్తున్నారు.
పోలీసులు, అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం, పలన్‌పూర్ తాలూకాలోని హసన్పూర్, రాంపురా వడ్లా గ్రామాల్లో ఈ దాడులు జరిగాయి. ఎలుగుబంటి అకస్మాత్తుగా గ్రామ పరిసరాల్లోకి రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అయితే అప్పటికే ఆ జంతువు పలువురిపై దాడి చేసి గాయపరిచింది.
గాయపడిన వారిని వెంటనే పలన్‌పూర్ సివిల్ ఆసుపత్రి, మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పలన్‌పూర్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ జోషి మాట్లాడుతూ ఎలుగుబంటి దాడిలో గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు.
వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కావడంతో కుట్లు వేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆసుపత్రి వైద్య బృందం వెంటనే స్పందించి గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించిందని తెలిపారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఎలుగుబంటి దాడిలో గాయపడిన వారిలో రూపాబెన్ నఖాజీ మలునా, విక్రమ్జీ హిరాజీ మలునా, సంజయ్‌కుమార్ హిరాజీ మలునా, సకీల్భాయ్ ఘేమర్భాయ్ మలునా, పుర్బా లక్ష్మణ్‌భాయ్ చౌహాన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా హసన్పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు హసన్పూర్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. దానిని బంధించేందుకు బోనును ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే పొలాల్లోకి వెళ్లిపోయిన ఎలుగుబంటిని పట్టుకోవడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా గంటలు గడిచినా ఎలుగుబంటి ఆచూకీ లభించకపోవడంతో గ్రామాల్లో భయ వాతావరణం కొనసాగుతోంది.
ప్రస్తుతం అటవీ శాఖ ప్రత్యేక బృందాలు పొలాలు, పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఎలుగుబంటిని సురక్షితంగా పట్టుకునేందుకు మత్తు మందు తుపాకులు, ప్రత్యేక బోనులను ఉపయోగిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
అడవి ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లోకి వన్యప్రాణులు రావడం ఇటీవలి కాలంలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలుగుబంటి పట్టుబడిన తర్వాత దానిని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపడతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news