న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మోడ్రన్ ఫార్మకాలజీ (సీసీఎంపీ) పూర్తి చేసిన వారికి మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో నమోదు చేసుకునేందుకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు దిగుతారని ఐఎంఏ హెచ్చరించింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు ఐఎంఏ లేఖ రాసింది. ఆగస్టు 3, 2026న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సీసీఎంపీ అర్హత కలిగిన వారికి మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో నమోదు ప్రక్రియ ఆగస్టు 5 నుంచి ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.
ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనిల్‌కుమార్ జే. నాయక్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సర్బరీ దత్తా సంతకాలతో విడుదలైన లేఖలో సీసీఎంపీ కోర్సుకు జాతీయ వైద్య కమిషన్ లేదా జాతీయ హోమియోపతి కమిషన్ నుంచి ఆమోదం లేదని పేర్కొన్నారు. ఇలాంటి కోర్సు ఆధారంగా ఆధునిక వైద్య విధానంలో రిజిస్ట్రేషన్ కల్పించడం వైద్య విద్యా ప్రమాణాలకు విరుద్ధమని ఐఎంఏ అభిప్రాయపడింది.
ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు వైద్య విధానాల్లో రిజిస్ట్రేషన్ కల్పించడం దేశంలో ఇప్పటివరకు లేని విధానమని వైద్య సంఘం పేర్కొంది. దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు, ప్రమాణాలు, నియంత్రణ వ్యవస్థలు లేవని తెలిపింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రోగుల్లో వైద్యుల అర్హతలు, చికిత్స సామర్థ్యంపై గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ అంశంపై ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని ఐఎంఏ గుర్తుచేసింది. న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించకూడదని కోరింది.
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్న వాదనను కూడా ఐఎంఏ ఖండించింది. 2014లో మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చట్టంలో సవరణలు చేసిన సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో అర్హత కలిగిన వైద్యుల సంఖ్య పెరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీల సమస్య పెద్దగా లేదని తెలిపింది.
గ్రామీణ సేవల కోసం ఎంబీబీఎస్ వైద్యులకు అమలు చేసిన తప్పనిసరి బాండ్ విధానాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసిందని ఐఎంఏ ప్రస్తావించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు అందుబాటులో ఉన్న వైద్యుల సంఖ్య సరిపోతుందని వివరించింది.
ఎంబీబీఎస్ వైద్యులు పొందే దీర్ఘకాలిక, కఠినమైన వైద్య విద్యా శిక్షణను కొంతకాలం వ్యవధి ఉన్న సీసీఎంపీ కోర్సుతో సమానంగా చూడటం సరైనది కాదని ఐఎంఏ పేర్కొంది. ఆధునిక వైద్య విధానంలో వైద్య విద్య, అర్హతల నియంత్రణ జాతీయ స్థాయి చట్టబద్ధ సంస్థల పరిధిలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మార్పులు చేయడం సరికాదని తెలిపింది.
వైద్య విధానాలకు సంబంధించిన నియమాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు 1996లో ఇచ్చిన తీర్పును కూడా ఐఎంఏ ప్రస్తావించింది. ఒక వైద్య విధానంలో నమోదు పొందిన వ్యక్తి గుర్తింపు పొందిన అర్హతలు లేకుండా మరో వైద్య విధానంలో చికిత్స చేయడం లేదా మందులు సూచించడం సాధ్యం కాదని పేర్కొంది.
మహారాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఆధునిక వైద్య విధానంలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు, ఇంటర్న్లతో కలిసి ఉద్యమానికి దిగుతామని ఐఎంఏ హెచ్చరించింది.
సీసీఎంపీ వైద్యుల రిజిస్ట్రేషన్ అంశం ప్రస్తుతం మహారాష్ట్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా వైద్య రంగంలో చర్చకు దారితీసింది. వైద్య సేవల నాణ్యత, రోగుల భద్రత, వైద్య అర్హతల ప్రమాణాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news