ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని వివాహిత మహిళను వేధించిన కేసులో మైలవరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పండితవల్లూరు గ్రామానికి చెందిన తోట కృష్ణ అనే వ్యక్తి మైలవరానికి చెందిన ఓ వివాహిత మహిళతో సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
పరిచయం పెరిగిన తర్వాత నిందితుడు మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె అతడి ప్రవర్తనను వ్యతిరేకించడంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు. మైలవరం ప్రాంతానికి చెందిన కొందరి ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు మార్ఫింగ్ చేసిన ఫొటోలను పంపించి మహిళను ఇబ్బందులకు గురి చేసినట్లు వెల్లడైంది.
వేధింపులు భరించలేక బాధితురాలు సుమారు 20 రోజుల కిందట మైలవరం పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో స్థానికంగా కొందరి సహకారం కూడా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు.
సీసీ కెమెరా దృశ్యాలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. అనంతరం మైలవరంలో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
మైలవరం సీఐ కిశోర్‌బాబు మాట్లాడుతూ నిందితుడికి సహకరించిన వ్యక్తుల వివరాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నేరానికి సహకరించినట్లు తేలితే వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తూ మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కేసును వేగంగా ఛేదించిన మైలవరం పోలీసులను విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు అభినందించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news