విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్ భాను నగర్ సిగ్నల్ వద్ద నుంచి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బొండా ఉమా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. గత 24 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అదే సమయంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గత 24 నెలల అభివృద్ధే తమ బలమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజల సంతృప్తే తమ విజయానికి కొలమానమని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో పార్టీ శ్రేణులు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నాయని తెలిపారు. డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరిస్తున్నారని చెప్పారు.
నియోజకవర్గ అభివృద్ధికి గత రెండేళ్లలో సుమారు రూ.550 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని బొండా ఉమా వివరించారు. రహదారులు, ఫ్లైఓవర్లు, తాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన వంటి అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, శ్రీ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బొండా ఉమా అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమని, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్, క్లస్టర్ ఇంచార్జ్ ఘంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు శ్రీను, ప్రధాన కార్యదర్శి పవన్, జోగినాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని నాయకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news