జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని శివ కేశవుల పుణ్యక్షేత్రంలో శ్రావణ శుక్రవారం, పౌర్ణమి సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల ఆధ్వర్యంలో ఇర్రిపాక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గ బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు, పద్మావతి దేవి, గంగారత్నం దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమానికి హాజరైన కంబాల శ్రీనివాసరావు దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కంబాల శ్రీనివాసరావు దంపతులు శివ కేశవులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరలక్ష్మి అమ్మవారికి పూజలు చేసిన అనంతరం జ్యోతుల నెహ్రూ, కంబాల శ్రీనివాసరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇర్రిపాక శివ కేశవుల ఆలయంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో కుటుంబ సమేతంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వ్రతాలు నిర్వహిస్తున్న మహిళలకు తన వంతుగా బంగారు రూపులు, పట్టుచీరలను ఉచితంగా అందించాలని సంకల్పించినట్లు చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణతో పాటు మహిళల్లో హైందవ చైతన్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో శ్రావణమాసంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించి ఆచరించాలని కంబాల శ్రీనివాసరావు అన్నారు. భారతదేశం విశ్వగురువుగా ఎదగాలని ఆకాంక్షించారు. జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆలయాల అభివృద్ధితో పాటు విద్య, వైద్యం, ఆర్థిక సహాయం వంటి పలు సేవా కార్యక్రమాలకు తన సొంత నిధులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కంబాల శ్రీనివాసరావు అందిస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఇర్రిపాక శివ కేశవుల పుణ్యక్షేత్రం నిరంతరం ఆధ్యాత్మిక శోభతో వెలుగొందాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సెప్టెంబర్ 4న అష్టలక్ష్మి గుడి నిర్మాణానికి తన చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని, సెప్టెంబర్ 5న రామాలయం నిర్మాణానికి కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహిస్తామని వెల్లడించారు.
అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన 200 మంది మహిళలకు వరలక్ష్మి బంగారు రూపులు, పట్టుచీరలు, పసుపు కుంకుమలను జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు, కంబాల శ్రీనివాసరావు, పద్మావతి దేవి, గంగారత్నం దంపతులు అందజేశారు. మహిళలకు బంగారు రూపులు, పట్టుచీరల పంపిణీ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సామూహిక వ్రతాలు, సేవా కార్యక్రమాలతో ఇర్రిపాక శివ కేశవుల ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
Fetching videos...
Fetching latest news...
No trending news