భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఇటీవల శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు రాజీనామా చేస్తున్న ఘటనలు పెరగడంతో కేంద్ర అంతరిక్ష శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్-డీఓఎస్) కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశంలోని వివిధ ఇస్రో కేంద్రాల నుంచి సుమారు 100 మంది సిబ్బంది సంస్థను వీడిన నేపథ్యంలో, జాతీయ ప్రాధాన్యం కలిగిన అంతరిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల రాజీనామాలను నియంత్రించేందుకు ప్రత్యేక మెమోరాండం జారీ చేసింది. ముఖ్యంగా గగన్యాన్ వంటి అత్యంత కీలకమైన మిషన్లలో పనిచేస్తున్న నిపుణులు అకస్మాత్తుగా సంస్థను వీడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇస్రో దేశ గర్వకారణమైన శాస్త్రీయ సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య-ఎల్1 వంటి విజయవంతమైన అంతరిక్ష మిషన్లతో పాటు, ప్రస్తుతం భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్ మిషన్పై వేగంగా పనిచేస్తోంది. ఇలాంటి కీలక దశలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు రాజీనామా చేయడం సంస్థ పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ జారీ చేసిన మెమో ప్రకారం, జాతీయ ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది రాజీనామాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. ఒక ఉద్యోగి రాజీనామా చేస్తే దాని ప్రభావం సంబంధిత ప్రాజెక్టుపై ఎంత మేర పడుతుందో అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అవసరమైతే ప్రత్యామ్నాయ సిబ్బందిని సిద్ధం చేసిన తర్వాతే రిలీవ్ చేసే విధానాన్ని అనుసరించాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news