ఉత్తరాంధ్రలో అశాంతి, అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతోనే మహిళా పోలీస్ అధికారి ఎస్సై ప్రవళికపై వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించాయని జనసేన నేత మాదాసు నరసింహ ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై దౌర్జన్యంగా ప్రవర్తించిన వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా అధికారిపై దాడి జరిగినా వైసీపీ అధినేత జగన్ స్పందించకపోవడంపై నరసింహ ప్రశ్నించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పట్ల జగన్కు గౌరవం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు సొంత పార్టీ నేతల ప్రవర్తనను పరిశీలించాలని సూచించారు.
గంజాయి కేసులు, నేర ఘటనల్లో ఉన్న వారిని పరామర్శించే జగన్, మహిళా పోలీస్ అధికారిపై జరిగిన దాడిపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలు వైసీపీ నేతల వ్యవహార శైలిని గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని మాదాసు నరసింహ హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను అడ్డుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news