రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు శకటాల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా దేశ స్వతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి గుర్తుచేశారు. సాహిత్యం, సంస్కృతి, సంఘసంస్కరణ ఉద్యమాలకు ఈ జిల్లా కేంద్రంగా నిలిచిందన్నారు. కేంద్ర సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
అన్నదాత సుఖీభవ ద్వారా 1,33,056 రైతు కుటుంబాలకు రూ.66.58 కోట్ల లబ్ధి అందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్లు, కౌలు రైతులకు రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ తోటల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పశుసంవర్థక శాఖ ద్వారా 1,587 గోకులం షెడ్లు కేటాయించగా, 1,072 నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నామని తెలిపారు.
విద్యారంగంలో తల్లికి వందనం ద్వారా 2,62,218 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.341 కోట్లు జమ చేశామని మంత్రి చెప్పారు. డొక్కా సీతమ్మ బడి భోజన పథకం ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి విద్యామిత్ర కింద రూ.20.89 కోట్ల విలువైన విద్యా కిట్లు పంపిణీ చేశామన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, మహిళలు, మైనార్టీలు, దివ్యాంగులు, అంగన్వాడీ లబ్ధిదారుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
జిల్లాలో 63,031 ఇళ్ల నిర్మాణం చేపట్టగా 38,837 ఇళ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే 12,199 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించామని చెప్పారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, మండపేట, నిడదవోలు పట్టణాల్లో గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. జిల్లాలో ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని, దాదాపు 20 లక్షలకు పైగా ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా 2,67,217 మందికి ప్రతి నెలా రూ.118 కోట్ల సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.
జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఆర్అండ్బీ ద్వారా 308 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించామని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.262 కోట్లతో 655 కిలోమీటర్ల సీసీ రహదారులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.198 కోట్లతో 496 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని వివరించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.128 కోట్లతో 66,744 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించామని తెలిపారు.
2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.2,643 కోట్లతో 1,612 పనులు ప్రతిపాదించగా, రూ.428 కోట్ల విలువైన 362 పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాను ప్రపంచ పర్యాటక పటంలో నిలపాలన్న లక్ష్యంతో రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు. హేవలాక్ వంతెనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, కడియం నర్సరీ అనుభవ కేంద్రం, పుష్కర్ ఘాట్, శెట్టిపేట, చినకాశీరేవు తదితర ప్రాంతాల్లో పర్యాటక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా మరో ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనకు గత వారం నిర్వహించిన చైతన్య కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది, బ్యాంకు అధికారులు, పీ4 మార్గదర్శకులు, ప్రైవేటు సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ కలసికట్టుగా తూర్పుగోదావరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news